తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉరుముతున్న అణు యుద్ధం!.. అదే జరిగితే 300 కోట్ల మంది మృత్యువాత!! - రష్యా లేటెస్ట్ న్యూస్

Nuclear Attack : ఉక్రెయిన్​పై ఎలాగైనా విజయం సాధించాలనే కసితో అణ్వాయుధ ప్రయోగానికి పుతిన్​ వెనకాడబోరన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పుతిన్‌ దూకుడుతో అణుయుద్ధం తలెత్తితే.. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లమంది మృత్యువాతపడతారని అంచనా.

russia nuclear attack
రష్యా అణుదాడి

By

Published : Oct 17, 2022, 6:50 AM IST

Russia Nuclear Attack : ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఎదురుదెబ్బలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో ఉన్న ఆయన.. అణ్వస్త్ర వినియోగానికీ వెనకాడబోరన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైచేయి కోసం రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాల వంటివాటిని ప్రయోగించినా.. నాటో సైనికపరంగా జోక్యం చేసుకోవడం ఖాయమని, ఫలితంగా పూర్తిస్థాయి అణు యుద్ధం ముంచుకురావొచ్చని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధంలో గెలుపు దక్కే అవకాశాల్లేకపోతే.. తప్పనిసరి పరిస్థితుల్లో పుతిన్‌ అణ్వస్త్రాలను బయటకు తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వార్షిక అణ్వస్త్ర విన్యాసాలకు నాటో సిద్ధమవుతుండటమూ ఆయనకు ఆగ్రహం కలిగిస్తున్న సంగతిని గుర్తుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన అణ్వాయుధాలను వినియోగించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే వాటి వాడకాన్ని పుతిన్‌ కేవలం బెదిరింపులకే పరిమితం చేస్తారా లేక పెను విధ్వంసం సృష్టించడానికా అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొంటున్నారు.

నేరుగా దాడి చేస్తారా?
ఉక్రెయిన్‌ భూభాగంపై నేరుగా అణుదాడి చేయడం పుతిన్‌ ముందున్న ప్రత్యామ్నాయాల్లో ఒకటి. పూర్తి దేశాన్ని తుడిచిపెట్టేసేలా కాకున్నా.. ఓ ప్రధాన సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక అణ్వాయుధాన్ని రష్యా ప్రయోగించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రత్యర్థి దేశాన్ని తీవ్రంగా దెబ్బకొట్టేందుకు ఆ దాడి దోహదపడుతుందని పుతిన్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. అమెరికా, నాటో నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకుంటాయి. ప్రతీకార దాడులకు దిగుతాయి. పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి.

నల్ల సముద్రంలో వేస్తారా?
పుతిన్‌ నల్ల సముద్రంలో అణుబాంబులను పేల్చేందుకూ అవకాశాలున్నాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన బెల్గరోడ్‌ జలాంతర్గామి రష్యా అమ్ములపొదిలో ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో సునామీని సృష్టించి.. వందల కిలోమీటర్ల దూరంలోని నగరాలను సైతం నాశనం చేయగల సామర్థ్యమున్న పుసైడన్‌ న్యూక్లియర్‌ టార్పెడో డ్రోన్లను అది మోసుకెళ్లగలదు. దాని సాయంతో దాడిచేస్తే.. ఒక్కసారిగా సముద్రం పోటెత్తి.. తీర నగరాలు, చిన్న దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి. సముద్ర జలాలు విపరీతంగా కలుషితమవుతాయి. నల్ల సముద్రంలో ఎక్కువగా ఉండే ప్రమాదకర హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాతావరణంలోకి చేరి తీర ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాణాంతకంగా మారుతుంది. సునామీ ధాటికి చుట్టుపక్కల ఉన్న ఉక్రెయిన్‌, బల్గేరియా, రొమేనియా, మాల్డోవా, టర్కీ వంటి దేశాలకు పెను నష్టం వాటిల్లుతుంది.

సొంత భూభాగంపైనా వాడే అవకాశం
తమ దేశ ఉత్తర భూభాగంలోని నొవయా జెమ్ల్‌యా వంటి ఏదైనా ఓ ప్రాంతంలో రష్యా అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అణుదాడిపై తాము చేసే హెచ్చరికలు గాలిమాటలు కాదని ఉక్రెయిన్‌, నాటోలకు చాటిచెప్పేందుకు అలా చేయొచ్చు.

వినియోగిస్తే వినాశనమే..
ఓ అంచనా ప్రకారం.. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,700 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. వాటిలో రష్యా వాటాయే 6 వేలకు పైగా ఉంటుంది. వాటన్నింటినీ వినియోగిస్తే మానవాళి వినాశనం తప్పదు. పుతిన్‌ దూకుడుతో అణుయుద్ధం తలెత్తితే.. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లమంది మృత్యువాతపడతారని అంచనా. అణుబాంబుల పేలుడుతో ఉత్పన్నమయ్యే వేడి.. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది. పేలుడు జరిగిన చోటు నుంచి అనేక కిలోమీటర్ల వరకు రేడియోధార్మిక ధూళి వ్యాపిస్తుంది. కొన్ని నెలల తర్వాత దాని ప్రభావానికి గురైనా మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ఆ ధూళి వల్ల ఏళ్లపాటు భూమిపై సూర్యరశ్మి పడదు. ఫలితంగా ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్య స్థాయిలో పడిపోతాయి. ప్రపంచమంతటా కరవు తలెత్తుతుంది. దానివల్ల మరో 200 కోట్లమంది ప్రాణాలు కోల్పోయే ముప్పుంది.

స్వల్పస్థాయిలో వాడినా..
ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని స్వల్పస్థాయిలో వ్యూహాత్మక అణ్వాయుధాలను రష్యా వాడినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఉక్రెయిన్‌ నుంచి ఏటా అనేక దేశాలకు గోధుమలు ఎగుమతి అవుతుంటాయి. అక్కడ పంటలు పండకపోతే అనేక దేశాల్లో ఆకలి కేకలు అధికమవుతాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసులు తెగిపోతాయి. ఇంధన, ఔషధ కొరత తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతాయి. కరెన్సీల విలువ భారీగా పతనమవుతుంది.

ఇవీ చదవండి:'తైవాన్ జోలికి వస్తే తగ్గేదేలే.. అవసరమైతే ఆ పనీ చేస్తాం'

బార్​లో షూటింగ్.. 12 మంది మృతి.. మరో ముగ్గురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details