Hezbollah Fires Rockets At Israel :హమాస్ ఉప నేత సలేహ్ అరౌరీని హతమార్చిన ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్‌బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. అరౌరీని లెబనాన్ రాజధాని బీరుట్‌లోనే హతమార్చడం వల్ల తమపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందన్న భావనతో ఎదురుదాడి చేసింది. శనివారం ఏకంగా 62 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా విరుచుకుపడింది. మౌంట్ మెరోన్పై ఉన్న గగనతల నిఘా స్థావరం వైపు 62 రాకెట్లను ప్రయోగించామని, అవి నేరుగా లక్ష్యాన్ని తాకాయని హెజ్‌బొల్లా ప్రకటించింది. రెండు సరిహద్దు ఔట్ పోస్టులపైనా దాడులు చేశామని తెలిపింది.
ఇస్లామిక్ గ్రూప్ కూడా దాడులు
మరోవైపు లెబనాన్ ఇస్లామిక్ గ్రూపు కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. శుక్రవారం రాత్రి కిర్యత్ ష్మోనాపై రాకెట్లతో దాడి చేశామని పేర్కొంది. అరౌరీపై దాడి చేసిన సమయంలో తమ గ్రూపునకు చెందిన ఇద్దరు ఫైటర్లు మరణించారని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని తెలిపింది. మెరోన్ వైపు 40 రాకెట్లు వచ్చినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మౌంట్ మెరోన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బేస్ ఇజ్రాయెల్‌కు ఆక్రమిత పాలస్తీనాలో ఉన్న అతి కీలక స్థావరంగా ఉంది. అక్కడి నుంచే సిరియా, లెబనాన్, తుర్కియే, సైప్రస్‌తో పాటు మధ్యదరా సముద్ర ఉత్తర, తూర్పు బేసిన్ల వైపు ఆపరేషన్స్‌ను ఇజ్రాయెల్ నిర్వహిస్తుంటుంది.
మరో 122 మంది మృతి
గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 122 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 22,722కు చేరుకుందని వెల్లడించింది.