Hamas Videos Israel Girl :ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి అనేక మందిని హతమార్చి, దాదాపు 200 మందిని బందీలుగా అపహరించిన హమాస్ మిలిటెంట్ సంస్థ... ఓ మహిళా బందీకి సంబంధించిన వీడియో విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో 21 ఏళ్ల ఫ్రాన్స్-ఇజ్రాయెలీ మహిళ మియా షెమ్ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు.
Israel Hamas War News :తన పేరు మియా అని తమది గాజా సరిహద్దులోని షోహమ్ అనే ప్రాంతమని ఆమె పేర్కొంది. అక్టోబరు 7న రీమ్ కిబుట్జ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్ పార్టీకి వెళ్లినట్లు తెలిపింది. అక్కడ నుంచే చాలా మంది బందీలను హమాస్ మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. ఆ సంగీత వేడుకపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. తన చేతికి తీవ్రగాయమైందని, గాజాలో తనకు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందని మియా ఆ వీడియోలో పేర్కొంది. తనకు అక్కడ మందులు ఇస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా తనను ఇక్కడి నుంచి విడిపించాలని కోరింది. ఆమె ఎలా గాయపడిందో మాత్రం మియా ఆ వీడియోలో వివరించలేదు.
'మానవత్వం ఉన్నట్లు చెప్పుకునేందుకే అలా..'
Hamas Videos Telegram :ఈ వీడియోను హమాస్ మిలిటెంట్లు తమ సొంత టెలిగ్రామ్‌లో విడుదల చేయగా.. ఆ తర్వాత ఆ సంస్థ మద్దతుదారులు కొందరు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మియా కిడ్నాప్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ధ్రువీకరించింది. మియా కుటుంబాన్ని సంప్రదించి.. ఆమె హమాస్ చెరలో ఉన్నట్లు చెప్పామని తెలిపింది. తమను తాము మానవత్వం ఉన్న మనుషులుగా చిత్రీకరించుకునేందుకే హమాస్ ఈ వీడియోను విడుదల చేసిందని, కానీ అది ఓ భయంకరమైన ఉగ్రవాద సంస్థ అని, అనేక మంది పసిబిడ్డలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులను అపహరించారని, పలువురిని హత్య చేశారని ఐడీఎఫ్ తెలిపింది. మియాతో పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఐడీఎఫ్ పేర్కొంది.