Hamas Militants Dead Bodies :మెరుపుదాడికి దిగిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతోంది. తమ దేశంలోకి చొరబడిన 1,500 మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చింది. వారి మృతదేహాలు ఇజ్రాయెల్ భూభాగంపై పడి ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లు చొరబడ్డ ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. గాజాతో సరిహద్దు ప్రాంతం పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గాజాను అష్ట దిగ్బంధనం చేసినట్లు వెల్లడించింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 900 మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరో 2,600 మందికిపైగా గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు.
Israel Hamas War 2023 : మరోవైపు 3 లక్షల మంది రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది ఇజ్రాయెల్. ఇప్పటికే వైమానిక దాడులతో గాజాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్... హమాస్ మిలిటెంట్లను ఏరి పారేసేందుకు గాజాలోకి సైన్యంతో అడుగుపెట్టనుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అలా జరిగితే యుద్ధం మరింత తీవ్రరూపు దాల్చనుంది. తమ దేశంపై దాడి చేసి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని ఇజ్రాయెల్ మొదలుపెట్టలేదు కానీ.. ముగింపునిస్తుంది అంటూ ఆయన నేరుగా హమాస్‌ను హెచ్చరించారు.
మరోవైపు గాజా సిటీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది. బాంబు మోతలతో గాజా పట్టీ దద్దరిల్లుతోంది. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. గాజా పార్లమెంట్, మంత్రుల కార్యాలయాలపైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. గాజాకు సమీపంలోని పలు పట్టణాల్లోని ప్రజలను ఇజ్రాయెల్ ఖాళీ చేయించింది. భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించింది. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లు విడిచిపెట్టి తరలిపోయారు. మరోవైపు, హెచ్చరికలు లేకుండా పాలస్తీనీయులపై దాడులు జరిపితే.. బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఒక్కొక్కరిగా చంపేస్తామని హమాస్ హెచ్చరించింది.