Hamas Hostage Release :ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గాజాలోని హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల బందీలో 210 మంది ఉన్నారనిఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఇదే ఆఖరి సంఖ్య కాదని ఆయన అన్నారు. అదృశ్యమైన వారి కోసం మిలిటరీ దర్యాప్తు కొనసాగిస్తోందని.. అనంతరం బందీల సంఖ్య మరింత పెరగొచ్చని వెల్లడించారు. అయితే హమాస్ శుక్రవారం ఇద్దరు అమెరికన్-ఇజ్రాయెల్ మహిళలను విడుదల చేసింది. వీరిద్దరు కాకుండానే ఇంకా 210 మంది వారి వద్ద బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నట్లు చెప్పింది.
'యుద్ధానికి హెజ్బొల్లా సై'
Israel Hamas War Hezbollah :మరోవైపు.. ఈ యుద్ధంలో పాల్గొనాలని లెబనాన్‌లోని సాయుధ సంస్థ అయిన హెజ్బొల్లా నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ఆరోపణలు చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. తమపై దాడులకు వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సౌత్ లెబనాన్ నుంచి హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు చేస్తోంది. వీటిని ఐడీఎఫ్ బలంగా ఎదుర్కొంటోంది. తాము జరిపిన ప్రతిదాడుల్లో 13 మంది హెజ్బొల్లా సభ్యులు హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
'హమాస్ తమ పౌరులనే చంపేస్తోంది'
Israel Hamas War Update :గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై.. హమాస్, పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 550కు పైగా విఫలమయ్యాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. అవి వారి భూభాగంలోనే పడిపోయాయని పేర్కొన్నారు. 'వారు తమ సొంత పౌరులనే చంపేస్తున్నారని' అని ఆరోపణలు చేశారు.
ఐరాస ప్రయత్నం సఫలం..
Israel Hamas War United Nations :గాజాలో మానవతా సంక్షోభం ఏర్పడకుండా ఐరాస, అమెరికా సహా పలు దేశాలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మానవతా సాయంతో కూడిన ట్రక్కులు గాజాలో ప్రవేశించాయి. ఈజిప్టు వైపు నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు నిత్యావసరాల సరఫరా మొదలైంది. శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో 3వేల టన్నులకుపైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది. అయితే.. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని రహదారులు దెబ్బతిన్నాయి. వేగంగా మరమ్మతులు చేపట్టారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టిన కొన్ని గంటల తర్వాత ట్రక్కులు.. రఫా సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి. పరిస్థితులు అనుకూలిస్తే మధ్యవర్తులతో చర్చించి మిగతా బందీలను విడిచిపెట్టనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఈజిప్టు, ఖతర్‌తోపాటు పలుదేశాలు చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.