Hamas Israel War :ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు చెందిన వందలాది పౌరులు మరణించారు. అలాగే ఇజ్రాయెల్ గాజాపై జరిపిన ప్రతీకార దాడిలో 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గాజాపై పూర్తి పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గాజాను పూర్తిగా దిగ్భందించాలని సైనికులను ఆదేశించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. గాజాకు అధికారులు విద్యుత్ నిలిపివేస్తారని అన్నారు. అలాగే ఆహారం, ఇంధనాల సరఫరాను అడ్డుకుంటారని చెప్పారు.
ప్రాణాలు కోల్పోయిన థాయిలాండ్ వాసులు..
మరోవైపు.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిలో తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 11 మంది థాయ్ పౌరులు హమాస్ బందీలుగా ఉన్నారు. మరో ఎనిమిది మంది పౌరులు గాయపడి చికిత్స పొందుతున్నారని థాయ్ ప్రతినిధి వెల్లడించారు. మొత్తం 30 వేల మంది థాయ్ కార్మికులు ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మంది తమను కాపాడాలంటూ కోరినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ అక్కడికి విమానాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
హమాస్ ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది నేపాలీలు ప్రాణాలు కోల్పోయారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. గాజా సరిహద్దుల్లోని కిబిడ్జు అలుమిమ్ ఫామ్‌లో మొత్తం 17 మంది నేపాలీలు పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా తప్పించుకోగా నలుగురు గాయపడ్డారు. ఒకరి ఆచూకీ తెలియడం లేదు. హమాస్ దాడిలో చనిపోయిన నేపాలీలు అందరూ విద్యార్థులే. దాదాపు 5 వేల మంది నేపాలీలు ఇజ్రాయెల్‌లో ఉన్నారు .