Hamas Air Force Head Died :గాజాలోని హమాస్ నెట్‌వర్క్‌పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ ఏరియల్ ఆపరేషన్లు నిర్వహించే విభాగం హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ అబు మురద్ మృతి చెందాడని ఐడీఎఫ్ చెప్పినట్లు ఇజ్రాయెల్ పత్రిక వెల్లడించింది. శుక్రవారం రాత్రంతా హమాస్ కమాండో దళాలకు చెందిన పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే, అతడి మృతిని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు.
పాలస్తీనీయన్ల కోసం కారిడార్లు..
Israel Ground Attack On Gaza :మరోవైపు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైన ఇజ్రాయెల్.. ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాణభయంతో పాలస్తీనీయులు వలస బాట పట్టారు. అయితే, ఇజ్రాయెల్ నిరంతర వైమానిక దాడులతో వీరు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే వీరి కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరలింపు కారిడార్లను అందుబాటులో ఉంచినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఆ గడువులో ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచించింది.
సౌదీ కీలక నిర్ణయం
Israel Saudi Arabia Deal : ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అరబ్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని.. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం.