Guyana Venezuela Conflict :ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. మరోవైపు గాజాలోని హమాస్ దళాలపై ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు మరో యుద్ధం అంటూ వస్తున్న వార్తలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశం గయానాలోని ఎసెక్విబోలోని చమురు నిల్వలను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా వెనెజులా కదనానికి కాలు దువ్వుతోంది. ఎసెక్విబో ప్రాంతంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. 2015 నుంచి ఇక్కడ జరిపిన అన్వేషణలో 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు బయటపడ్డాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనెజులా ఈ చమురు నిల్వలపై కన్నేసింది. దశాబ్దాలుగా ఎసెక్విబో ప్రాంతం తమదేనని వాదిస్తున్న వెనెజులా ఎసెక్విబోను స్వాధీనం చేసుకునేందుకు సైనిక శక్తితో పావులు కదుపుతోంది. ఈ పరిస్థితుల్లో అతి చిన్న దేశమైన గయాన తరపున అమెరికా రంగంలోకి దిగింది. గయానా సైన్యంతో కలిసి వెనెజులా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు నిర్వహించింది.
గయానా-వెనెజులా మధ్య ఉన్న ఎసెక్విబో వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో వివాదాన్ని అక్కడే తేల్చుకోకుండా వెనెజులా సైనిక శక్తిని ప్రయోగిస్తుండడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తమ దేశంలోనే ఓ రెఫరెండం నిర్వహించారు. ఎసెక్విబో తమదే అంటున్న ప్రభుత్వ వాదనపై ప్రజాభిప్రాయం కోరింది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటుచేయడంపై కూడా రెఫరెండాన్ని కోరారు. ప్రభుత్వ వాదనను సమర్ధించాలని దేశప్రజలను కోరారు. ఈ రెఫరెండంలో ప్రజల్లో 95 శాతం మంది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని వెనెజులా సర్కార్ ప్రకటించింది. ఈ రిఫరెండం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపుతూ కొత్త మ్యాపులను వెనెజులా ప్రభుత్వం విడుదల చేసింది.