Gupta Brothers Arrest: గుప్తా బద్రర్స్‌గా ప్రాచుర్యం పొంది, దక్షిణాఫ్రికాలో భారీస్థాయి అవినీతికి పాల్పడిన భారతదేశానికి చెందిన ముగ్గురు సంపన్న సోదరుల్లో ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) అరెస్టయ్యారు. అక్రమాలు బయటపడగానే దుబాయి పారిపోయిన ఈ ముగ్గురు సోదరుల్లో రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మూడో సోదరుడు అజయ్ గుప్తాను అరెస్టు చేశారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది.
అవినీతి వ్యవహారంలో గుప్తా సోదరులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన దాదాపు ఏడాది తర్వాత వీరు అరెస్టవ్వడం గమనార్హం. దక్షిణాఫ్రికా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుంచి బిలియన్ల కొద్దీ ర్యాండ్లను (దక్షిణాఫ్రికా కరెన్సీ) దోచుకున్నారని గుప్తా సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలపై విచారణలు సాగుతుండగానే ఈ సోదరులు దక్షిణాఫ్రికా నుంచి తమ కుటుంబాలతో సహా దుబాయికి ఉడాయించారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించగా.. వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
ఇదిలా ఉండగా.. దుబాయి నుంచి గుప్తా సోదరులను రప్పించి శిక్ష వేసేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది. రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో గుప్తా సోదరులను వెనక్కి తీసుకొచ్చేందుకు దక్షిణాఫ్రికా.. ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. అయితే ఆ తర్వాత 2021లో యూఏఈతో నేరస్థుల అప్పగింతపై ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే యూఏఈ ప్రభుత్వం రాజేశ్, అతుల్ గుప్తాలను దక్షిణాఫ్రికాకు అప్పగించే అవకాశాలున్నాయి.