తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో తుపాకీ సంస్కృతికి చెక్‌.. ఆ చట్టంపై బైడెన్​ సంతకం - జో బైడెన్​

Gun violence bill: ఎప్పుడెప్పుడా అని అమెరికన్లు ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తుపాకీ నియంత్రణ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేశారు. ఈ చట్టంతో ప్రాణాలు రక్షిస్తామని.. శ్వేతసౌధంలో పేర్కొన్నారు.

GUN-VIOLENCE-BILL
అమెరికాలో తుపాకీ సంస్కృతికి చెక్‌

By

Published : Jun 26, 2022, 5:04 AM IST

Gun violence bill: అగ్రరాజ్యంలో తుపాకీ నియంత్రణ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. అమెరికాలో విశృంఖలమవుతున్న తుపాకీ సంస్కృతిని కట్టడి చేసేందుకు.. ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవల టెక్సాస్ ఎలిమెంటరి పాఠశాలలో ఇద్దరు టీచర్లతో సహా 19 మంది విద్యార్థుల ఊచకోతతో పాటు సాముహిక కాల్పులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టంపై బైడెన్‌ సంతకం చేశారు. ఈ చట్టంతో ప్రాణాలు రక్షిస్తామని.. బైడెన్‌ వైట్‌ హౌస్‌లో పేర్కొన్నారు. గురువారం ఈ బిల్లుకు సెనెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత.. వైట్‌ హౌస్‌ తుది ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం తుపాకులు కొనుగోలు చేసే అత్యంత పిన్న వయస్కులకు నేపథ్య తనిఖీలను మరింత కఠినతరం చేస్తారు.

బిల్లులో ఏముందంటే...

  • న్యూయార్క్‌, టెక్సాస్‌లలో కాల్పులు జరిపింది 18 ఏళ్ల వయసువారే. దీంతో ఇకపై 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనదలిచేవారికి నేర రికార్డులు ఉన్నాయా అని ఫెడరల్‌, స్థానిక అధికారులు తనిఖీ చేసే గడువును బిల్లు పెంచింది. ఇంతవరకు తనిఖీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి కావలసి ఉండగా, దాన్ని పది రోజులకు పెంచారు.
  • గృహ హింసకు పాల్పడినట్టు చరిత్ర ఉన్నవారు... ప్రస్తుతం భార్య లేదా ప్రియురాలితో కలసి ఉంటున్నా, లేకపోయినా తుపాకులు కొనడానికి మాత్రం అర్హులు కారు.
  • ప్రమాదకర వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకులను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు కోర్టు ఉత్తర్వులు పొందే హక్కును కల్పిస్తూ... ఇప్పటివరకూ 19 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్స్‌ ఆఫ్‌ కొలంబియా చట్టాలు చేశాయి. ఈ ప్రక్రియకు ఫెడరల్‌ ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి బిల్లు వీలు కల్పిస్తుంది.
  • తుపాకుల అక్రమ రవాణాదారులకు, ఇతరుల కోసం తుపాకులు కొనేవారికి 25 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. కాగా- తుపాకుల నియంత్రణ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం తెలిపి, తనకు పంపించిన వెంటనే ఆమోదముద్ర వేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్‌.. తాజాగా బిల్లుపై సంతకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details