ప్రేమికులు పెళ్లికి ముందు ఎంత కలివిడిగా ఉన్నప్పటికీ.. ఆ బంధాన్ని పెళ్లి వరకు మాత్రం కొందరే తీసుకెళ్తారు. మరికొందరు తమ భాగస్వాములను వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నారంటూ పెళ్లిమండపం వద్ద గొడవ చేసే సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. అయితే ఇదే విధంగా మహిళల పట్ల ఓ పెళ్లి కుమారుడి ప్రవర్తనను వ్యతిరేకిస్తూ అతడి మాజీ ప్రియురాళ్లందరూ కలిసి పెళ్లిమండపం వద్దే నిరసన చేపట్టారు. ఈ ఘటన చైనాలో జరిగింది.
వరుడికి షాక్ ఇచ్చిన మాజీ లవర్స్.. బ్యానర్ పట్టుకుని పెళ్లి మండపం ఎదుట నిరసన - పెళ్లి మండపం వద్ద యువతల ధర్నా
మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట తనను పెళ్లి చేసుకోమని ప్రియురాలు నిరసనలు చేయడం సహజమే. మరికొందరు ప్రియుడు తనను మోసగించాడని కోర్టులను ఆశ్రయిస్తుంటారు. అయితే చైనాలో మాత్రం ఓ పెళ్లి కుమారుడి ప్రవర్తనను వ్యతిరేకిస్తూ అతడి ప్రియురాళ్లందరూ బ్యానర్ పట్టుకుని పెళ్లి మండపం ఎదుటే నిరసన చేపట్టారు. ఏం జరిగిందంటే?
నైరుతి చైనాలోని యున్నన్ ప్రావిన్సుకి చెందిన చెన్ అనే యువకుడు ఇటీవల వివాహానికి రెడీ అయ్యాడు. అదే సమయంలో పెళ్లిమండపం వద్ద కొందరు యువతులను చూసి ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. 'మేం నీ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమందరం కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం' అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకొని వారు పెళ్లి మండపం ఎదుట ఉన్న రోడ్డుపై నిరసన చేపట్టారు. పెళ్లికి వచ్చిన వారంతా వారిని ఆసక్తిగా గమనించారు. అనంతరం అసలేమైందంటూ వారిని అడగటం మొదలుపెట్టారు.
ఇలా పెళ్లి మండపం ముందు యువతులు నిరసన తెలుపడం వల్ల ఆందోళన చెందిన వధువు, ఆమె తల్లిదండ్రులు.. పెళ్లి కుమారుడు చెన్ను వివరణ కోరారు. వాళ్లు చేసిన నిరసనకు తనకేమీ కోపం రాలేదని.. గతంలో ఓ చెడు బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్న మాట వాస్తవమేనని చెన్ తెలిపాడు. అప్పట్లో తనది చిన్న వయసని.. పూర్తి పరిపక్వత లేనందున చాలా మంది అమ్మాయిలను బాధ పెట్టానని చెప్పాడు. అమ్మాయిలను మోసం చేయొద్దని.. వారితో నిజాయతీగా ఉండాలని సూచించాడు. అయితే, పెళ్లి సమయంలో వారు చేసిన పని కాస్త ఇబ్బంది పెట్టిందని.. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తనతో గొడవపడిందని చెన్ వాపోవడం గమనార్హం.