తెలంగాణ

telangana

ETV Bharat / international

గుడ్​న్యూస్.. ఇక 6 నెలల్లోనే గ్రీన్​కార్డ్​కు క్లియరెన్స్! - get us green card fastest way

Green card USA time period: గ్రీన్​ కార్డ్ జారీని వేగవంతం చేసేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కీలక సిఫార్సు చేసేందుకు.. ఈ అంశంపై ఏర్పాటైన సలహా మండలి సిద్ధమైంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులన్నింటిపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా నిబంధనలు సవరించేలా ప్రతిపాదించాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి ఆమోదం లభిస్తే.. వేల మంది భారతీయులకు లబ్ధి జరగనుంది.

Green card USA time period
గుడ్​న్యూస్.. ఇక 6 నెలల్లోనే గ్రీన్​కార్డ్​కు క్లియరెన్స్!

By

Published : May 17, 2022, 10:52 AM IST

Green card news: అమెరికన్ గ్రీన్ కార్డ్​ కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న వేల మంది భారతీయుల కల త్వరలోనే నెరవేరనుందా? అగ్రరాజ్యంలో శాశ్వత నివాసానికి అనుమతించే దస్త్రం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఆరు నెలల్లోనే పని పూర్తి కానుందా? అమెరికా ప్రభుత్వంలోని ఓ కీలక కమిటీ చేపడుతున్న చర్యలు చూస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది.

ఆసియన్ అమెరికన్లు, నేటివ్ హవాయియన్లు, పసిఫిక్ ఐలాండర్స్ వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్ష సలహా మండలి.. గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్​ కార్డ్​ దరఖాస్తును పరిశీలించి, నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఆరు నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు భారతీయ అమెరికన్ అజయ్ జైన్ భుటోరియా చేసిన ప్రతిపాదనకు.. ఆ కమిటీలోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. త్వరలోనే సంబంధిత నివేదికను శ్వేతసౌధానికి పంపనున్నారు.

Green card fast processing: గ్రీన్​ కార్డ్ జారీ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయడంపై ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేశారు అజయ్ జైన్. జనాభా పెరిగినా.. అమెరికా వీసా విధానంలో మార్పులు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుత పద్ధతులన్నింటినీ సమీక్షించుకుని.. నిర్ణయాలు వేగంగా వెలువడేలా అవసరమైన చోట్ల మార్పులు చేయాలని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల సంస్థ(యూఎస్​సీఐఎస్​)కు సిఫార్సు చేశారు. గ్రీన్​ కార్డ్ వీసా ఇంటర్వ్యూలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, ఇందుకోసం అవసరమైతే అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు అజయ్ జైన్.

అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే పత్రమే గ్రీన్​ కార్డ్. హెచ్​1బీ వీసాలపై అగ్రరాజ్యానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఈ గ్రీన్ కార్డ్​ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే.. ఒక్కో దేశానికి 7శాతం మాత్రమే గ్రీన్​ కార్డులు ఇవ్వాలన్న నిబంధన సహా ప్రస్తుతమున్న వీసా విధానం.. వారికి ఇబ్బందికరంగా మారింది. కొందరు గ్రీన్​ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు అజయ్ జైన్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనుంది.

ABOUT THE AUTHOR

...view details