Srilanka crisis: వారు నలుగురు అన్నదమ్ములు.. కలసికట్టుగా ఉంటారు.. రాజకీయాల్లో రాణిస్తుంటారు.. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు.. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం యత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు.. ఆఖరికి ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల పలాయనం చిత్తగించారు. ఇదంతా మన పొరుగు దేశమైన శ్రీలంకలో రాజపక్స సోదరులు సాగించిన దోపిడీ పర్వం. ఒకప్పుడు వైభవంగా వెలిగిన వీరు గొటబాయ రాజపక్స పారిపోవడం వల్ల నియంత పోకడలతో పాలన సాగిస్తే ఎప్పటికైనా శంకరగిరి మాన్యాలు పట్టవలసిందేనన్న సత్యానికి తాజా ఉదాహరణగా మిగిలారు..
శ్రీలంక రాజకీయాల్లో రాజపక్సలది కీలకస్థానం. 2009లో మహిందా రాజపక్స తమిళ వేర్పాటు ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈని పూర్తిగా నిర్మూలించడం వల్ల సింహళ జాతీయవాదులు ఆయనకు మద్దతుగా నిలిచారు. మహిందాతో పాటు ఆయన సోదరులైన చమల్, బసిల్, గొటబాయలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే తమకు ఎదురులేదన్న రీతిలో వారు పాలించారు. చైనా నుంచి పెట్టుబడుల ప్రవాహం సాగింది. తమ సొంత ప్రాంతమైన హంబన్‌టోటాలో భారీ నౌకాశ్రయాన్ని డ్రాగన్ సౌజన్యంతో నిర్మించారు. అయితే చెల్లింపులు చేయలేకపోవడం వల్ల చివరకు 99 ఏళ్ల లీజుకు చైనాకు ధారదత్తం చేశారు. అయితే మహిందా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల్లో అధిక భాగాన్ని ఆయన సోదరులతో పాటు కుటుంబం ఇతర దేశాలకు తరలించినట్టు అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గొటబాయ 'వైట్ వ్యాన్లు':అన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గొటబాయ రాజపక్స అప్రకటిత సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. తమిళ పులులపై యుద్ధం నేపథ్యంలో ఆయన నేతృత్వంలో సైన్యం సాగించిన దాష్టీకాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రభుత్వంపై ఎవరు విమర్శించినా తెల్లవ్యాన్లలో సాయుధులు వచ్చి కిడ్నాప్‌లు చేసేవారు. అనంతరం అదృశ్యమైన వారి ఆచూకీ తెలిసేది కాదు. కిడ్నాప్‌లకు గురైన వారిని దారుణంగా హింసించి హత్య చేసినట్టు పలు సంస్థలు ఆరోపించాయి.