Gotabaya Rajapaksa returns to Sri Lanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు స్వదేశానికి తిరిగి వచ్చే హక్కు ఉందని.. అయితే, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగయ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు లేవని గుర్తుచేసింది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో దేశాన్ని విడిచి వెళ్లిపోయిన గొటబాయ.. ఈ వారం తిరిగి రానున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడొకరు వెల్లడించిన తెలిసిందే. తొలుత మాల్దీవులకు వెళ్లిన గొటబాయ ఆ తర్వాత సింగపూర్‌కి.. అక్కడి నుంచి నేరుగా బ్యాంకాక్‌కు చేరుకొని, ప్రస్తుతం అక్కడే ఓ హోటల్‌లో ఉంటున్నారు.
గొటబాయ శ్రీలంకకు రావొచ్చు, కానీ ఆ విషయంలో తగ్గేదే లే - శ్రీలంకకు గొటాబయ రాజపక్స
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు స్వదేశానికి తిరిగి వచ్చే హక్కు ఉందని అయితే, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు లేవని గుర్తుచేసింది.
![గొటబాయ శ్రీలంకకు రావొచ్చు, కానీ ఆ విషయంలో తగ్గేదే లే SRI LANKA GOTABAYA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16162152-thumbnail-3x2-gotabaya.jpg)
'గొటబాయ రాజపక్స శ్రీలంక పౌరుడు. మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఆయనకు ఉంది. ఈ హక్కును ఎవరూ కాదనలేరు. అయితే, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన్ను విచారించాలి. తన తల్లిదండ్రుల స్మారక చిహ్నం కోసం రాష్ట్ర నిధులను ఖర్చు చేశారనే ఆరోపణల్లో ఆయనపై కేసు ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు లేవు. కాబట్టి.. ప్రస్తుతం ఆయన్ను విచారించవచ్చు. దోషిగా తేలితే జరిమానా విధించవచ్చు' అని ఎస్‌జేబీ నేత అజిత్ పి పెరీరా వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అందించిన ఒక బిలియన్ డాలర్ల రుణ సౌకర్యాన్నీ రాజపక్స ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు.