భారతీయత తనలో భాగమని, ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకెళ్తానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన ఆయన... ఇందుకు భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ.. సుందర్ పిచాయ్‌కు భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందించారు.
పద్మభూషణ్ అందుకుంటున్న సుందర్ పిచాయ్ "నన్ను ఇలా తీర్చిదిద్దిన దేశం నుంచి ఈ విధంగా గౌరవం పొందడం చాలా గొప్ప అనుభూతి. భారత ప్రభుత్వానికి, ప్రజలకు నేను కృతజ్ఞతతో ఉన్నా. ఈ అవార్డును నేను సురక్షితంగా ఎక్కడైనా పెట్టేస్తా. కానీ భారతీయత ఎప్పటికీ నాలో భాగంగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా దాన్ని(భారతీయతను) నా వెంట తీసుకెళ్తా" అని పిచాయ్ పేర్కొన్నారు. తన కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని పిచాయ్ గుర్తు చేసుకున్నారు. ఎన్నో విషయాలు నేర్పించిన అలాంటి కుటుంబంలో పెరగడం అదృష్టమని అన్నారు.
పద్మభూషణ్ అందుకుంటున్న సుందర్ పిచాయ్ భారత్‌కు తాను అనేక సార్లు వచ్చానని చెప్పిన సుందర్ పిచాయ్.. సాంకేతిక విషయంలో దేశంలో వేగవంతమైన మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు. భారత్‌లోని ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. "డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ విషయంలో అనేక అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు సైతం ఇప్పుడు అంతర్జాలం అందుబాటులో ఉంటోంది. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా విజన్.. అభివృద్ధికి ఊతం కలిగించేదే. గూగుల్‌తో భారత్‌కు ఉన్న బంధాన్ని కొనసాగించేందుకు నేను ఎదురుచూస్తున్నా. మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం" అని చెప్పారు. ఈ సందర్భంగా.. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించారు పిచాయ్.
ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు డిజిటల్ ఉత్పత్తులు, నైపుణ్యాలను అందుబాటులో తెస్తున్నందుకు పిచాయ్‌ను అభినందించారు సంధూ. భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకోవాలని గూగుల్‌కు పిలుపునిచ్చారు.