జర్మనీ హాంబర్గ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. చర్చిపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9:15 సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
చర్చిలో కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హాటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన నిందితుడు తప్పించుకుని బయటకు వెళ్లినట్లు ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో కాల్పులు జరిపిన నిందితుడు చర్చిలోపలే ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. చర్చిలోపల ఉన్న వ్యక్తే ఈ కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. బయట వ్యక్తులకు ప్రమేయం ఇందులో లేదని అధికారులు తెల్చారు. ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న కొందరు వ్యక్తులు దాదాపు 25 సార్లు కాల్పుల జరిగిన శబ్దం విన్నట్లు చెబుతున్నారు. మరి కొందరు ఈ కాల్పులు జరిగిన తర్వాత ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు వెళ్లినట్లు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ న్యాయ విద్యార్థిని కేవలం 20 సెకండ్ల వ్యవధిలోనే నాలుగు సార్లు కాల్పులు విన్నట్లు పోలీసులకు చెప్పింది. అయితే ఈ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారనే దానికి అప్పుడే స్పష్టంగా చెప్పలేమని పోలీసు ప్రతినిధి హోల్గర్ వెహ్రాన్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందిచిన హాంబర్గ్ మేయర్ బాధితుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాల్పులు జరిగిన ఈ చర్చి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దీన్ని 19వ దశాబ్దంలో స్థాపించారు. ప్రస్తుతం ఈ చర్చిలో 1,70,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు.