Gaza Ground Attack :గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను ఏరివేసే లక్ష్యంతో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయల్ రక్షణ బలగాలు(IDF)... శుక్రవారం రాత్రి నుంచి మరింతగా విరుచుకుపడుతున్నాయి. హమాస్‌కు చెందిన 150 భూగర్భ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించాయి. శుక్రవారం రాత్రి చేపట్టిన భూతల దాడుల్లో హమాస్ బలగాలతో పెద్ద ఎత్తున పోరాటం జరిగినట్లు ఇజ్రాయెల్ టైమ్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడుల్లో సైనికులెవరూ గాయపడలేదని వివరించింది. అనేక మంది హమాస్ సభ్యులను హతమార్చామని వారికి చెందిన అనేక మౌలిక సదుపాయాలు నాశనం చేశామని IDF చెబుతోంది. భూతల ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున IDF ఇంజనీరింగ్ దళాలు, ట్యాంకులు ప్రస్తుతం గాజా పట్టీ లోపలే పోరాటం చేస్తున్నాయి.
Gaza Ground Operation : గాజాలో పూర్తిస్థాయి భూతల దాడులకు బదులుగా సైనికచర్యను ఉద్ధృతం చేసినట్లు IDF చెబుతోంది. వారికి తోడుగా ఇజ్రాయెల్ వైమానిక బలగాలు.. గాజా పట్టీలోని హమాస్‌కు చెందిన 150 భూగర్భ కేంద్రాలను నాశనం చేశాయని తెలిపింది. తీవ్రవాదుల పోరాట టన్నెళ్లు, భూగర్భ కేంద్రాలు, వారి మౌలిక సదుపాయాలను దాడుల్లో నాశనం చేసినట్లు వెల్లడించింది. హమాస్ వైమానిక దళాల అధిపతి అసెమ్ అబు రకబా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమైనట్లు IDF ధ్రువీకరించింది. హమాస్‌కు చెందిన డ్రోన్లు, ఏరియల్ వెహికల్స్, ప్యారాగ్లైడర్స్, ఏరియల్ డిటెక్షన్ వ్యవస్థలను అబూ రకబా పర్యవేక్షించేవాడిని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ ఏడున హమాస్ చేసిన భీకర రాకెట్ దాడిలో అబూ రకబా కీలక పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. రకబా ఆదేశాల మేరకే హమాస్‌కు చెందిన పారాగ్లైడర్లు దక్షిణ ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చినట్లు తెలిపింది. తమ రక్షణ దళాల పోస్టులపై జరిగిన డ్రోన్ల దాడికి కూడా అసెమ్ నేతృత్వం వహించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.