Gaza Egypt Border Open : గాజా స్ట్రిప్‌లో విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు, తీవ్రంగా గాయపడ్డవారికి ఉపశమనం కలిగింది. గాజా స్ట్రిప్ నుంచి ఈజిప్టునకు వెళ్లే కీలక రఫా క్రాసింగ్.. వీరి కోసం తెరుచుకుంది. ఇందుకు ఈజిప్టు, హమాస్, ఇజ్రాయెల్ మధ్య అమెరికా మద్దతుతో ఖతార్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది.
క్షతగాత్రులను తరలించేందుకు అంగీకరించిన ఈజిప్టు..
విదేశీ పాస్‌పోర్టుదారులే కాక తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను కూడా తరలించేందుకు గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్‌తో పాటు ఈజిప్టు కూడా అంగీకరించింది. వారికి తమ దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు అంగీకరించింది. తమ దేశం నుంచి గాజా లోపలికి అంబులెన్సులను పంపించి.. తీవ్రంగా గాయపడ్డవారిని తీసుకెళుతోంది ఈజిప్టు. ఇప్పటి వరకు 88 మందిని అంబులెన్సులలో ఈజిప్టుకు తీసుకెళ్లింది.
ఈ ఒప్పందం ఎన్నిరోజులు అమలులో ఉంటుందో ఏ దేశం కూడా వెల్లడించలేదు. అలాగే.. ఒప్పందం కుదరడానికి అటు హమాస్ గానీ ఇటు.. ఇజ్రాయెల్ గానీ ఎలాంటి షరతులు విధించలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం 500 మంది విదేశీ పాస్‌పోర్టుదారులను గాజా వీడి ఈజిప్టు వచ్చేందుకు అనుమతించారు. గాజా జనాభా 23 లక్షలుకాగా వీరిలో ఎంతమందికి విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయో అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు.