Gastric Problem To Fish :గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఓ చేపకు సరైన సమయంలో చికిత్స అందించి కాపాడారు వైద్యులు. అమెరికా కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలో జరిగిందీ ఘటన.
డెన్వర్‌లోని జంతు సంరక్షణశాలలో అనేక జీవులు ఉంటాయి. వాటిలోని ఓ చేపకు మాత్రం గత వారం అసాధారణ సమస్య వచ్చింది. ఈత కొట్టేందుకు ఆ చేప ఇబ్బంది పడింది. ఫ్రెంచ్ ఏంజెల్ఫిష్గా పిలిచే ఆ అందమైన మత్స్యం పడుతున్న అవస్థల్ని జూలో పని చేసే ఓ వ్యక్తి గుర్తించారు. బులుగు, పసుపు రంగుల్లో ఉండే ఆ చేప కాస్త ఉబ్బి ఉండడాన్ని, ఈత కొట్టేటప్పుడు పక్కకు ఒరగడాన్ని ఆ ఉద్యోగి గమనించారు. ఏదో తేడాగా ఉందని అనుకుని చేపను జాగ్రత్తగా పట్టుకున్నారు. డెన్వర్ జంతు సంరక్షణశాలలోనే ఉండే ఆస్పత్రి వైద్యుల దగ్గరకు ఆ ఫ్రెంచ్ ఏంజెల్ ఫిష్‌ను తీసుకెళ్లారు.
చేపను డెన్వర్ జూ వైద్యులు నిశితంగా పరిశీలించారు. సమస్య ఏంటో తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కానీ వారికి ఓ సమస్య వచ్చింది. జూలో ఉన్న సీటీ స్కాన్ యంత్రం చాలా పెద్దది. ఏకంగా 318 కిలోల వరకు బరువు ఉండే ఎలుగుబంటికి కూడా వైద్య పరీక్షలు చేసేందుకు ఆ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. అలాంటిదానితో ఇప్పుడు 7 అంగుళాల చేపకు సీటీ స్కాన్ చేయాల్సి వచ్చింది. అందుకే వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.