తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ మాటకు జైకొట్టిన 'జీ20'.. యుద్ధం ఆపాలని రష్యాకు పిలుపు - జీ20 దేశాల సదస్సు

ప్రస్తుత యుగం యుద్ధాలకు కాదని జీ20 దేశాలు ఉద్ఘాటించాయి. యుద్ధాన్ని ఆపాలని రష్యాకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిబింబించేలా ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

g20-sumit-declaration
g20-sumit-declaration

By

Published : Nov 16, 2022, 4:48 PM IST

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలు జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రతిధ్వనించాయి. ప్రస్తుత సమయం యుద్ధానికి కాదంటూ సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో వ్యాఖ్యానించాయి. ఈ మేరకు ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో చాలా అంశాలు రష్యా ఆక్రమణ చుట్టూనే తిరిగాయి. సభ్య దేశాలన్నీ యుద్ధం, దాని ప్రభావంపై చర్చించాయి. అనంతరం, శాంతిస్థాపన కోరుతూ ఉమ్మడి ప్రకటన చేశాయి. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఆహార, ఇంధన భద్రతపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

జీ20 సమావేశం

సెప్టెంబర్ 16న ఉజ్బెకిస్థాన్​లో రష్యా అధ్యక్షుడు పుతిన్​తో భేటీ అయిన మోదీ.. 'ఇది యుద్ధాల కాలం కాదు' అని ఆయనకు నేరుగా హితవు పలికారు. ఘర్షణను వెంటనే ముగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీ20 సదస్సు ఉమ్మడి ప్రకటన సైతం ఇవే వ్యాఖ్యలను ఉపయోగించి.. శాంతికి పిలుపునిచ్చింది. అదే సమయంలో అక్రమ, అసంబద్ధ, రెచ్చగొట్టే విధానాలను వీడాలని రష్యాకు సూచించింది.

ఉమ్మడి ప్రకటన విషయంలో అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చేందుకు భారత్ విశేషంగా కృషి చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో చర్చలు జరిపి.. తుది ప్రకటన తయారు చేయడంలో సహకరించిందని పేర్కొన్నాయి. భారత్.. ఓ లీడర్​గా, పరిష్కార మార్గాలను సూచించిందని, నిర్మాణాత్మక విధానాన్ని అవలంబించిందని తెలిపాయి.

సమవేశాల్లో భాగంగా మంగళవారం సరదాగా కలుసుకున్న మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బుధవారం అధికారికంగా భేటీ అయ్యారు.
బ్రిటన్, భారత్ మధ్య ద్వైపాక్షిక భేటీ

ఇక, జీ20 సదస్సుకు హాజరైన పలు దేశాల నేతలతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ఇటలీ అధినేత్రి జార్జియా మెలోనీతో భేటీ అయిన ఆయన.. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, ఉగ్రవాద నిరోధక అంశాలపై చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనీస్​తో సమావేశమైన మోదీ.. వ్యూహాత్మక భాగస్వామ్యం సహా విద్య, ఆవిష్కరణల అంశాలపై సమాలోచనలు చేశారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో బంధం బలోపేతం కోసం జర్మనీ ఛాన్స్​లర్ ఓలాఫ్ షోల్జ్​తో చర్చలు జరిపినట్లు మోదీ ట్విట్టర్​లో తెలిపారు. అంతకుముందు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్​తోనూ భేటీ అయ్యారు మోదీ. అణు ఇంధనం, రక్షణ, వాణిజ్యం, ఆహార భద్రత అంశాలపై చర్చించినట్లు మోదీ ట్వీట్ చేశారు. సమావేశాల అనంతరం మోదీ.. దిల్లీకి బయల్దేరారు.

ఓలాఫ్ షోల్జ్, అల్బెనీస్​లతో మోదీ
జార్జియా మెలోనీతో మోదీ

ABOUT THE AUTHOR

...view details