Russian Gold Ban: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా.. పెద్దన్న అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ దేశ చమురును కొనొద్దని చాలా రోజుల కిందటే పశ్చిమాసియా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇది భారత్‌కు ప్రయోజనం చేకూర్చింది. రష్యా డిస్కౌంట్లో భారత్‌కు చమురును విక్రయించింది.
ఇప్పుడు రష్యాను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాలని భావించిన జీ-7 దేశాలు.. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం భావించాలని చూస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం వెల్లడించారు. ఆంక్షలకు సంబంధించి అధికారిక ప్రకటన మంగళవారం వచ్చే అవకాశం ఉంది.
రాయితీతో భారత్‌కు లాభం: రష్యాపై ఆంక్షలతో.. సౌదీ సహా పలు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలతో ఇతర దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చౌక ధరలకు చమురు విక్రయించింది వ్లాదిమిర్ పుతిన్ సర్కార్. భారత ప్రభుత్వం ఫిబ్రవరి- మే మధ్య రష్యా నుంచి 40 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. 2021లో వచ్చిన మొత్తం దిగుమతులతో పోలిస్తే ఇది 20 శాతం అధికం.
ఇప్పుడు రష్యా నుంచి బంగారం దిగుమతులపై కూడా ప్రపంచ దేశాలు నిషేధం విధిస్తే అది భారత్‌కు ప్రయోజనం చేకూరుస్తుందా? లేదా? అని వ్యాపార నిపుణులు మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు.. జీ-7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది రష్యా. రెండు నివాస భవంతుల్ని కూల్చివేసినట్లు కీవ్ మేయర్ విటలీ క్లిట్స్కో తెలిపారు.
దాడులు మళ్లీ తీవ్రం:తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంపై గత కొన్ని రోజులుగా దృష్టిసారించిన రష్యా సేనలు మళ్లీ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురిపెట్టాయి. కీలకమైన డాన్‌బాస్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పుతిన్ సేనలు.. క్రమంగా పట్టు సాధించాయి.