France protests update today : దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించినప్పటికీ నిరసనకారులను అదుపు చేయడం కష‌్టంగా మారింది. పట్టపగలే కొందరు కొందరు తీవ్రస్థాయిలో హింసకు పాల్పడుతున్నారు. పారిస్ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలను లూటీ చేస్తున్నారు. శుక్రవారం స్ట్రాస్‌బర్గ్‌లోని యాపిల్ స్టోర్ లోపలకు నిరసనకారులు చొరబడి.. అక్కడి సామగ్రిని దోచుకెళ్లారు. పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. మర్సీలీలోని ఓ తుపాకుల దుకాణంలోనూ దుండగులు లూటీకి పాల్పడ్డారు. కొన్ని ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
France protest reason : ఆందోళనకారుల్లో యువతే ఎక్కువగా ఉండడం ఫ్రెంచ్ పాలకులను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో టీనేజర్లను ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కోరారు. 17 ఏళ్ల నహేల్ అనే యువకుడిని ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులు కాల్చడం వల్ల దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లను అణచడానికి సోషల్ మీడియాపై ఆంక్షలను ప్రతిపాదించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. హింసాకాండకు ఆజ్యం పోయడంలో స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషించాయని ఆయన ఆరోపించారు. సమస్యాత్మక కంటెంట్‌ను తొలగించడానికి నిబంధనలు రూపొందిస్తామని మాక్రాన్ చెప్పారు. అల్లర్లలో పాల్గొని గురువారం అరెస్టైన వారిలో మూడింట ఒక వంతు యువకులేనని అధ్యక్షుడు వెల్లడించారు. ఫ్రాన్స్‌లో అత్యవసర స్థితితో పాటు, శాంతి పునరుద్ధణకు చేపట్టాల్సిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు.. ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ తెలిపారు.