France Plane Reached Mumbai : మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లో నిలిపివేసిన 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానం ఎట్టకేలకు ముంబయి చేరుకుంది. మంగళవారం ఉదయం వీరంతా ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. కాగా, వీరిందరిని సీఐఎస్ఎఫ్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. మిగతావారిని ప్రశ్నిస్తున్నారు.
అంతకుముందు భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి ఇండియాకు బయల్దేరింది విమానం. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబాయి నుంచి పారిస్ మీదుగా నికరాగువాకు చేరుకోవాల్సి ఉంది. కాని, దీనిని భారత్‌కు మళ్లించారు. వాస్తవానికి సోమవారం ఉదయమే ఈ విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే విమానంలోని కొందరు ప్రయాణికులు భారత్‌కు వచ్చేందుకు సుముఖత చూపకపోవడం వల్ల కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం తలెత్తినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
విమానాన్ని ఎందుకు ఆపారంటే?
303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం దుబాయి నుంచి నికరాగువాకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఇంధనం కోసం విమానాన్ని పారిస్ సమీపంలోని వాట్రీ విమానాశ్రయంలో ఆపారు. అయితే.. మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న అనుమానంతో స్థానిక అధికారులు ఆ విమానాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఫలితంగా నాలుగు రోజుల పాటు విమానం ఫ్రాన్స్‌లోనే చిక్కుకుపోయింది. ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సంబంధిత అధికారులతో చర్చించింది. ఈ వ్యవహారంపై ఆదివారం కోర్టులో విచారణ జరిగింది. చివరకు విమానం బయలుదేరేందుకు అన్ని అనుమతులు వచ్చాయి.