ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం.. మరో భారీ విధ్వంసానికి దారితీసేలా మలుపు తీసుకుంటోంది. నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను ప్రజాభిప్రాయం మేరకు అధికారికంగా శుక్రవారం తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా సారథ్యంలోని నాటో ఘాటుగా హెచ్చరించినా.. రష్యా తగ్గడం లేదు.
ఉక్రెయిన్‌లోని దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకునే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని అధికార ప్రతినిధి డిమిత్ర పెస్కోవ్ గురువారం తెలిపారు. క్రెమ్లిన్ సెయింట్ జార్జ్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల రష్యా అనుకూల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకం చేస్తారని పెస్కోవ్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. రష్యా వ్యతిరేక దేశాలు ఆంక్షల కత్తికి పదును పెడుతున్నాయి. శుక్రవారం నుంచి రష్యన్ పర్యటకులను తమ దేశంలోకి రాకుండా నిషేధిస్తామని ఫిన్లాండ్ ప్రకటించింది.
ఆ నాలుగు ప్రాంతాల వాటా 15 శాతం..
భారీ ప్రాణ, ఆస్తి నష్టంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్.. రష్యాలో విలీనం కావడం మరో భారీ దెబ్బ అవుతుంది. ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో ఈ నాలుగు ప్రాంతాల వాటా 15 శాతం. ఇది హంగేరీ లేదా పోర్చుగల్ భూభాగంతో సమానం. వీటికి క్రిమియాను కూడా కలిపితే అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర మంత భూభాగంతో సమానమవుతుంది.
'భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ప్రజలు మద్దతు'
ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు భూభాగాలు దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్‌ను ఆక్రమించిన రష్యా ఈ నెల 23 నుంచి 27 మధ్య అక్కడ రెఫరెండం నిర్వహించింది. రష్యాలో విలీనానికి అక్కడిని ప్రజలు భారీ సంఖ్యలో మద్దతు తెలిపారని ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను రష్యా నియమించిన యంత్రాంగం ప్రకటించింది.
'అదొక బూటకం.. ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం..'
అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణను బూటకంగా అమెరికా సారథ్యంలోని నాటో దేశాలు అభివర్ణించాయి. ఈ విషయంలో ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసానిచ్చాయి. ప్రజలెవరూ స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవని, రెఫరెండాన్ని అంగీకరించే సమస్యే లేదని స్పష్టం చేశాయి. ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినా.. పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇరుపక్షాలు పరస్పరం అణు హెచ్చరికలు చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచాయి.