తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్​ - ఇమ్రాన్ ఖాన్ రాజీనామా

Imran khan arrest : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్‌ హైకోర్టు బయట ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. దీంతో కోర్టు వెలుపల ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

imran khan arrest
imran khan arrest

By

Published : May 9, 2023, 3:22 PM IST

Updated : May 9, 2023, 4:17 PM IST

Imran khan arrest : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. ఇస్లామాబాద్‌ హైకోర్టు బయట ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. అక్రమ ఆస్తుల కేసులో విచారణకు హాజరైన ఇమ్రాన్‌కు పాకిస్థాన్‌ పారామిలటరీ దళాలు.. కోర్టు గది బయట అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. దాదాపు వంద కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు గత మార్చి నుంచి పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆయనను పారామిలటరీ దళాలు అరెస్టు చేసినట్లు పాక్‌ మీడియా తెలిపింది. తనను చంపేసేందుకే పోలీసులు ఈ అరెస్టు కుట్రలకు పాల్పడుతున్నారని గతంలో ఆయన ఆరోపించారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ అరెస్ట్ సమయంలో ఇస్లామాబాద్‌ హైకోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇమ్రాన్​ అరెస్టును అడ్డుకునేందుకు ఆయన తరఫు లాయర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణలు జరిగి కొందరు లాయర్లు గాయపడ్డారు. 'కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించిన పాక్‌ రేంజర్లు.. ఇమ్రాన్‌ కారును చుట్టుముట్టారు. ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు' పీటీఐ పార్టీ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌదరీ తెలిపారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ అక్రమాస్తుల కేసులో ఇస్లామాబాద్ కోర్టులో హాజరైనప్పుడు ఆయనను పారామిలటరీ దళాలు అరెస్ట్ చేసినట్లు పీటీఐ తరఫు లాయర్ ఫైసల్ చౌదరీ తెలిపారు. మరోవైపు కోర్టును పాక్ రేంజర్లు ఆక్రమించారని పీటీఐ పార్టీ నాయకులు ఆరోపించారు. అలాగే 'ఇమ్రాన్‌ ఖాన్​ను పోలీసులు హింసిస్తున్నారు. కొడుతున్నారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు' అని పీటీఐ నాయకురాలు ముష్రత్‌ చీమా పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.
మరోవైపు తనపై ఎలాంటి కేసు లేదని అరెస్ట్​కు ముందు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ఓ వీడియోలో తెలిపారు. ఆ వీడియోను పీటీఐ ట్విట్టర్​ హ్యాండిల్​లో పోస్ట్ చేశారు. 'నాపై ఎలాంటి కేసు లేదు. నన్ను జైలులో పెట్టాలని చూస్తున్నారు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను' అని ఇమ్రాన్ ఖాన్ ఆ వీడియోలో అన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్​..
తాజా ఘటనపై ఇస్లామాబాద్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆమిర్‌ ఫారుఖ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు డాన్‌ మీడియా కథనం వెల్లడించింది. 15 నిమిషాల్లో కోర్టు ముందు హాజరుకావాలని ఇస్లామాబాద్‌ పోలీసు చీఫ్‌, హోంశాఖ సెక్రటరీ, అదనపు అటార్నీ జనరల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అమిర్ ఫారుఖ్​ ఆదేశించారు. లేదంటే ప్రధానికి సమన్లు పంపించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించినట్లు డాన్​ మీడియా కథనంలో పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలంటూ చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించినట్లు తెలిపింది.

Last Updated : May 9, 2023, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details