విదేశీ కానుకల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. లాహోర్‌లోని ఆయన నివాసానికి మంగళవారం భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. దీంతో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్( పీటీఐ) కార్యకర్తలు ఇమ్రాన్ నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు, పీటీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఇంటి వెలుపల గుమిగూడిన ఆయన మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఇమ్రాన్ నివాసానికి వచ్చే అన్ని మార్గాల్లో కంటెయినర్లను ఏర్పాటు చేయడం సహా సైనిక బలగాలను మోహరించారు. నకిలీ కేసుల్లో తమ నాయకుడు పోలీసులకు లొంగిపోరని పీటీఐ నేతలు చెబుతున్నారు.
మహిళా జడ్జిని బెదిరించారనే కేసులో జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 16వ తేదీ వరకు సస్పెండ్ చేసిందన్న పీటీఐ కార్యకర్తలు.. ఇప్పుడు పోలీసులు ఎలాంటి వారెంట్ తెచ్చారో చూద్దామన్నారు. విదేశీ కానుకల కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు తమ బృందం ఆయన నివాసానికి వెళ్లినట్లు ఇస్లామాబాద్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.