Jaishankar Russia Visit: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వచ్చే నెలలో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమైన ప్రస్తుత తరుణంలో.. ఈ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 8వ తేదీన జైశంకర్ అక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. మాస్కో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరునేతలు సమావేశమై.. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.
అణుభయాల వేళ.. రష్యాకు వెళ్లనున్న భారత విదేశాంగ మంత్రి - భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమైన ప్రస్తుత తరుణంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వచ్చే నెలలో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరునేతలు సమావేశమై.. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారని రష్యా విదేశాంగశాఖ తెలిపింది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అణ్వాయుధాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా భయాలు కొనసాగుతున్నాయి. ఇంధన ధరలు, ఆహార సంక్షోభంపై ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా డర్టీ బాంబ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ బాంబు ప్రయోగానికి సన్నద్ధమైందంటూ.. ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఇలాంటి కీలక సమయంలో జైశంకర్ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇరు దేశాలూ పరస్పర దాడులకు అణ్వాయుధాలను ఆశ్రయించొద్దని రాజ్‌నాథ్ సూచనలు చేశారు.
రష్యా సైనిక చర్యను ఇప్పటివరకు బహిరంగ వేదికపై విమర్శించని భారత్.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు ఇప్పటికే అనేక సందర్భాల్లో పిలుపునిచ్చింది. గత నెలలో షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 'ఇది యుద్ధాల శకం కాదు' అని పుతిన్‌కు సూచించారు.