India Votes Against Russia:మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు. బుధవారం ఉక్రెయిన్ 31వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు అక్కడ యుద్ధం గురించి సమీక్షించడానికి భద్రతామండలి సమావేశమైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.
15 సభ్యదేశాలున్న భద్రతామండలిని ఉద్దేశించి వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మండలి కోరగా రష్యా అభ్యంతరం తెలిపింది. కొవిడ్ తీవ్రత తగ్గింది కాబట్టి జెలెన్‌స్కీ వ్యక్తిగతంగా హాజరై ప్రసంగించాలని షరతు పెట్టింది. యుద్ధం కొనసాగుతున్నందు వల్ల జెలెన్‌స్కీ భద్రతామండలికి రాలేరని కొన్ని దేశాలు ఆయన్ని సమర్థించాయి. ప్రొసీజరల్ ఓటింగ్‌లో భారత్ సహా 13 సభ్యదేశాలు జెలెన్‌స్కీ వర్చువల్ ప్రసంగానికి అనుకూలంగా, రష్యా ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ ఓటింగ్‌లో చైనా పాల్గొనలేదు.