Food Security and Nutrition:మనిషి ఆకలితో అలమటించే పరిస్థితిని రూపుమాపాలనే లక్ష్యాన్ని అందుకోవడం కష్టసాధ్యమేనని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చిచెప్పింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని ఐరాస నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా, ఏటా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చింది. ''2021లో ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమస్యను ప్రపంచం నుంచి తరిమివేయాలని 2015లో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని(ఎస్.డి.జి) నిర్దేశించుకుంది. కాగా అప్పటి కంటే ఇప్పుడు 18 కోట్ల మంది ఎక్కువయ్యారు. 2019లో కరోనా వచ్చిన తర్వాతనే 15 కోట్ల మంది అధికమయ్యారు. దీంతోపాటు ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు..అంటే సుమారు 231 కోట్ల మంది ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భరించే స్థితిలో లేని వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని'' ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్.ఎ.ఓ) తాజాగా ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్-2022 పేరుతో విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మంది పోషకాహార లోపానికి గురవుతారని, అంటే 2015లో ఉన్న స్థాయికి మళ్లీ చేరుకుంటామని ఆ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనూ సమస్య తీవ్రంగానే ఉందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..
ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 2004-06 సంవత్సరాల మధ్య 12.2 శాతం కాగా, 2019-21 మధ్య 3 శాతం మాత్రమే తగ్గి 9 శాతానికి చేరుకుంది. భారత్‌లో 2004-06 మధ్య 21.6 శాతం కాగా, 2019-21 మధ్య 16.3 శాతంగా ఉంది. చైనాలో అది 2.5, నేపాల్‌లో 5.5, పాకిస్థాన్‌లో 16.9 శాతంగా ఉంది.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే పరిస్థితి లేని వారి సంఖ్య భారత్‌తో సహా అనేక దేశాల్లో ఎక్కువగా ఉంది.
- ఆరోగ్యకర ఆహారం తీసుకోవడానికి అవసరమయ్యే ఖర్చు ప్రపంచ తలసరి రోజుకు 2017లో 3.314 డాలర్లు. 2020 నాటికి అది 3.537 డాలర్లయింది. భారతదేశంలో 2.824 డాలర్ల నుంచి 2.97 డాలర్లకు(రూ.230) పెరిగింది. దేశంలో ఆ మాత్రం వెచ్చించలేని వారు 2017లో 74.9 శాతం ఉండగా, 2020 నాటికి 70.5 శాతమయ్యారు. అంటే దేశంలో 97 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారం కోసం రోజుకు రూ.230 ఖర్చుచేసే స్థితిలో లేరు.
- ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు తగ్గడంతోపాటు ప్రజల సగటు ఆదాయం కూడా తగ్గింది. వీటన్నింటి ప్రభావం ఆహారభద్రతపై పడింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతను పెంచింది.
- కరోనా తర్వాత పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆర్థిక అసమానతలు, సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, ఆహారం, ఎరువులు, ఇంధన ధరలు పెరగడం ఇలా అనేక అంశాలు ద్రవ్యోల్బణాన్ని పెంచాయి. మహిళలు, యువత, తక్కువ నైపుణ్యం గల కూలీలు, అసంఘటిత రంగంలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- వ్యవసాయానికి, ఆహార భద్రత విధానాలకు ప్రభుత్వాల నుంచి తగినంత మద్దతు లేదు. అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఆరోగ్యం కోసం చేయాల్సిన ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది.