అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో నెత్తురు చిందింది. ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్ పార్క్‌లో సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 24 మంది గాయపడ్డారు. స్థానికంగా స్వాతంత్య్ర దినోత్సవ కవాతు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే.. కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కవాతును వీక్షించేందుకు, అందులో పాల్గొనేందుకు వచ్చిన వందల మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కవాతును లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు భవనం పైనుంచి కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
22 ఏళ్ల కుర్రాడిపై అనుమానం
కాల్పులకు పాల్పడిన దుండగుడిని రాబర్ట్ క్రిమో (22)గా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే రాబర్ట్ క్రిమో కోసం హైలాండ్ పోలీసులు వేట మొదలు పెట్టారు. అతడు పారిపోతుండగా ట్రాఫిక్ అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. అతడిని 'పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా పోలీసు శాఖ ప్రకటించింది. అతడు కాల్పులు జరిపిన ప్రదేశంగా భావిస్తున్న దుకాణం గోడకు ఓ నిచ్చెన వేసి ఉందని.. దుకాణంపైన కాల్పులు జరిగిన ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌ను వినియోగించినట్లు లేక్ కౌంటీ మేజర్ క్రైమ్ టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. దాడికి వినియోగించిన ఆయుధాన్ని ఎక్కడ కొనుగోలు చేశాడనే విషయంపై దర్యాప్తు మొదలైంది.