భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్, రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ అరుదైన ఘనతను సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం- నాసా కొత్తగా చేపట్టిన 'మూన్ టు మార్స్' ప్రోగ్రామ్‌కు సారథ్య బాధ్యతలు నిర్వహించునున్నారు. నాసాలోని ముఖ్య విభాగానికి సారథిగా నియమితులైన మొదటి భారత సంతతి వ్యక్తి అమిత్ క్షత్రియనే. వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలోనే.. అమిత్ సారథ్యంలో పనిచేసే 'మూన్ టు మార్స్' విభాగం ఉంటుంది. మానవాళి ప్రయోజనాల కోసం చంద్రుడు, అంగారక గ్రహాలపై నాసా తలపెట్టిన మానవ అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం ఈ నూతన ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
"మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ చంద్రుడిపై మా సాహస ప్రయోగాలను నిర్వహించడానికి.. అలాగే అంగారక గ్రహంపై మొదటిసారి మానవులను దింపడానికి నాసాను సిద్ధం చేయడంలో సహాయపడుతుంది" అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చంద్రుడు, అంగారక గ్రహాలపై మరింత లోతైన అన్వేషణ జరుగుతోందని ప్రోగ్రాంలోని సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధన మొదటి దశలోనే ఉందని.. అంగారకుడిపై మావవాళి జీవించేందుకు సంబంధించి మరో ముందడుగు వేయడానికి ఈ కొత్త ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని చెప్పారు. అంతేగాక చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ ఉనికిని స్థాపించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు స్పష్టం చేశారు.