సొంత దేశంలో ఉండలేక.. అగ్రరాజ్యంలో ఆశ్రయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న 39 మంది అగ్నికీలలకు బలైపోయారు. మెక్సికోలోని ఓ శరణార్థి కేంద్రంలో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 29 మంది గాయపడ్డారు. అయితే, శరణార్థులు పరుపులకు నిప్పంటించడమే కారణంగా తెలుస్తోంది. శరణార్థుల కేంద్రం నుంచి తమను బయటకు పంపిస్తున్నారనే విషయం తెలియడం వల్ల వలసదారులు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టారు. ఈక్రమంలోనే కేంద్రంలోని పరుపులకు నిప్పంటించగా.. మంటలు వ్యాపించి 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్‌లోని శరణార్థుల కేంద్రంలో జరిగిందీ దుర్ఘటన. వేర్వేరు దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు.. అమెరికాలోకి ప్రవేశించేందుకు సియుడాడ్ జువారెజ్ ముఖ్యమైన ప్రాంతం. అగ్రరాజ్యం ఆశ్రయం కోరిన అనేక మంది.. అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడి శరణార్థుల కేంద్రంలోనే ఉంటారు. అలాంటి చోట.. సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు దగ్గర్లోని 4 వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తునకు ఆదేశించింది.
ఫ్రిజ్ గోదాంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
చైనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ మూతపడిన రిఫ్రిజరేటర్ గోదాంలో మంటలు చెలరేగి.. 11 మంది మరణించారు. ఈ ప్రమాదం హెబెయ్ ప్రావిన్స్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆదివారం టునీషియాలో జరిగిన ఓ ప్రమాదంలో 29 మంది వలసదారులు మరణించారు. ఓ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోవడం వల్ల 29 మంది వలసదారులు మృతి చెందారు. మరో 67 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మందిని రక్షించినట్లు వారు చెప్పారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా ఆఫ్రికాకు చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు.