Fire Accident In France : తూర్పు ఫ్రాన్స్‌లోని దివ్యాంగుల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది వృద్ధ దివ్యాంగులు, మరో వ్యక్తి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.
ఇదీ జరిగింది..
ఫ్రాన్స్ వింట్జెన్హీమ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దివ్యాంగుల వసతి గృహంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికార యంత్రాగం.. నాలుగు అగ్నిమాపక యంత్రాలు, 76 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేసింది. ప్రమాదంలో గాయపడిన 17 మందిని రెస్క్యూ టీమ్ ఆసుపత్రికి తరలించింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక అధికారి క్రిస్టోఫ్ మారొట్ మీడియాతో మాట్లాడుతూ.. "ఈ దివ్యాంగుల బృందం తూర్పు ఫ్రాన్స్‌లోని నాన్సీ పట్టణంలో ఉంటుంది. వీరు వింట్జెన్హీమ్లోని దివ్యాంగుల వసతి గృహానికి వెకేషన్ కోసం వచ్చారు. మృతుల్లో వైకల్యం ఉన్న వృద్ధులు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఘటన స్థలంలో నాలుగు అంబులెన్స్‌లు, 40 మంది పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశాం" అని అన్నారు.