వారంతా శరణార్థులే పొట్టచేతబట్టుకుని పొరుగు దేశాలకు వలసవెళ్దామనుకున్నారు. సముద్రం దాటేందుకు ఓ చెక్క పడవను ఆశ్రయించారు. కానీ, మధ్యలోనే ఇంజిన్ పనిచేయకుండా పోయింది. దీంతో నడి సంద్రంలో నిస్సహాయంగా మిగిలిపోయారు. కనుచూపు మేర నీళ్లే. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నెలరోజులపాటు ఉన్నారు! గాలులతో అటూఇటూ కొట్టుకుపోయిన పడవ.. చివరకు ఇండోనేసియ తీరానికి చేరుకుంది. 57 మంది రోహింగ్య వలస జీవులతో కూడిన ఓ పడవ.. ఇక్కడి అషే బేసర్ తీరానికి చేరుకుందని స్థానిక అధికారులు ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. నెల రోజులపాటు తాము అండమాన్ సముద్రంలోనే కొట్టుమిట్టాడినట్లు వారు చెప్పారన్నారు.
నడి సంద్రంలో నరకం.. నెల రోజుల తర్వాత ఒడ్డుకు చేరిన రోహింగ్యా శరణార్థులు - international news
బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లాలనుకున్నా వారికి మార్గమధ్యంలోనే చేదు అనుభవం ఎదురైంది. పడవ ఇంజిన్ ఆగిపోయి ఆహారం, నీళ్లు లేక ఓ చిన్నపాటి పడవపైనే అండమాన్ సముద్రంలో నెలరోజులపాటు కొట్టుమిట్టాడిన ఓ రోహింగ్యా శరణార్థుల బృందం.. చివరకు ఇండోనేసియాకు చేరుకుంది.
ఈ శరణార్థులను తాత్కాలికంగా ప్రభుత్వ ఆవాసంలో ఉంచుతామని స్థానిక ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు. సముద్రంలో సుదీర్ఘ ప్రయాణంతో పాటు ఆహారం లేక.. వారంతా బలహీనంగా మారారని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని చెప్పారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే, వీరు ఎక్కడినుంచి వచ్చారో తెలియాల్సి ఉందన్నారు. వారం రోజుల క్రితం సముద్రంలో చిక్కుకుపోయిన 150 మంది రోహింగ్యాల బృందానికి చెందినవారా అనేది స్పష్టంగా తెలియలేదని చెప్పారు. ఆహారం, నీళ్లు అయిపోయిన ఆ చిన్న పడవలోని వ్యక్తులను రక్షించాలంటూ ఐరాస ఇప్పటికే.. ఆగ్నేయాసియాలోని అండమాన్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలను కోరింది.
వాస్తవానికి రోహింగ్యాలు.. మయన్మార్‌లో నివసిస్తుంటారు! కానీ, సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకుగానూ లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. మయన్మార్‌లో గతేడాది సైనిక తిరుగుబాటు అనంతరం.. వారి వలసలు మరింత పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వారంతా.. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. తాజాగా 57 మంది శరణార్థులు చేరుకున్న ఇండోనేసియా తీరం.. బంగ్లాదేశ్‌కు 1900 కి.మీల దూరంలో ఉండటం గమనార్హం.