అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వగృహంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు సోదాలు జరిపారు. 13 గంటల పాటు విల్మింగ్టన్లోని బైడెన్ నివాసంలో అధికారులు దాడులు నిర్వహించి ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు బైడెన్ వద్ద దాదాపు 12 రహస్య పత్రాలు బయటపడ్డాయి. ఈ రహస్య పత్రాలకు కేసును దర్యాప్తు చేయడానికి రాబర్ట్ హర్ అనే న్యాయవాదిని నియమించారు అటార్నీ జనరల్ గార్లాండ్.
"ఎఫ్‌బీఐ అధికారులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సెనేట్‌లో బైడెన్ ఉన్నప్పటి పత్రాలు కాగా.. మరికొన్ని 2009-16 మధ్య బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటివి."
--బాబ్ బాయర్, బైడెన్ వ్యక్తిగత న్యాయవాది
న్యాయ శాఖ జరుపుతున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరించమని బైడెన్ తమను ఆదేశించినట్లు బైడెన్ వ్యక్తిగత న్యాయవాది రిచర్డ్ సౌబర్ తెలిపారు. ఎఫ్‌బీఐ దాడుల సమయంలో అధ్యక్షుడు బైడెన్ గానీ, ఆయన భార్య కానీ స్వగృహంలో లేరని ఆయన వెల్లడించారు. అధ్యక్షుడి లాయర్లు, వైట్ హౌస్ కౌన్సిల్ కార్యాలయం విచారణకు పూర్తిగా సహకరిస్తుందని సౌబర్ పేర్కొన్నారు.
వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్‌లోని కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడానికి అక్కడున్న బీరువాలో ఫైళ్లను అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాదులు ప్యాక్ చేస్తుండగా కీలక రహస్య పత్రాలు బయటపడ్డాయి. 2017 మధ్య నుంచి 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యే వరకు ఈ కార్యాలయాన్ని బైడెన్ వాడుకున్నారు. ఈ పత్రాలు గతేడాది నవంబరు 2నే బయటపడగా.. అప్పుడే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చామని బైడెన్ న్యాయబృందం వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నతస్థాయిలోని కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. తమ పదవీకాలం పూర్తికాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్‌కు అప్పగించి వెళ్లాలనేది నిబంధన.
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాజీనామా!..
జో బైడెన్ సహాయకుడు, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ తన పదవిని వీడాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రెండేళ్లకు పైగా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన రాన్ మరి కొద్ది రోజుల్లో తన పదవిని వదులుకోనున్నట్లు సమాచారం. నవంబరులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఉహించినదానికంటే మెరుగైన ఫలితాలు సాధించడంలో రోన్ పాత్ర కీలకం.