North Korea Cryptocurrency Hack: ఉత్తర కొరియా నియంత కిమ్ తలుచుకొంటే ఎక్కడి నుంచైనా ఖరీదైన కార్లు ఫ్యాక్ అయి.. ప్యాంగ్‌యాంగ్ దిశగా వెళ్తాయి. ఉత్తర కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వం అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టారు. మరి క్రిప్టోలను తయారు చేయడానికి అవసరమైనంత విద్యుత్తు ఉత్తర కొరియాలో లేదుగా.. అక్కడ చాలా నగరాల్లో రాత్రివేళలు లైట్లు కూడా వేయరు కదా..! అనే సందేహం రావచ్చు. అది నిజమే అయినా.. కిమ్ అమ్ములపొదిలో జాతిరత్నాల్లాంటి హ్యాకర్లు ఉన్నారు. వారు బ్లాక్‌చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్‌ఛేంజిల్లోకి చొరబడి దోపిడీ చేయగలరు. ఆ సొమ్ముతో దీపావళీ పటాసుల వలే కిమ్ ఆయుధ ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా కిమ్ జాతిరత్నాలు ఒక్కదెబ్బకు మరో రూ.4,500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీలకు కన్నంపెట్టినట్లు తేలింది.
ఒక్కదెబ్బకు 600 మిలియన్ డాలర్లు హాంఫట్..!:గత నెల 23వ తేదీన క్రిప్టో కరెన్సీలను సంపాదించడానికి ఆడే యాక్సిస్ ఇన్ఫినిటీ అనే ఓ వీడియోగేమ్ నెట్‌వర్క్‌ను వాడుకొని ఉత్తరకొరియాకు చెందిన హ్యాకింగ్ బృందాలైన లాజరస్, ఏపీటీ38లు.. 620 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీని అపహరించాయి. ఈవిషయాన్ని మార్చి 29న అధికారికంగా ప్రకటించారు. యాక్సిస్ ఇన్ఫినిటీ అనే గేమ్‌ను స్కైమావిస్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ వీడియోగేమ్‌లో వినియోగదారులు క్రిప్టోలను ఒకరి నుంచి మరొకరికి పంపే నెట్‌వర్క్‌ను వాడుకొని హ్యాకర్లు ఈ అపహరణకు పాల్పడ్డారు.
అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గురువారం లాజరస్ గ్రూప్‌పై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం కోసం క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూపు పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్‌పై కూడా ఆంక్షలు ప్రకటించింది.
క్రిప్టో సొమ్ముతో అణుబాంబులు, క్షిపణలు..!:ఉత్తర కొరియా ఆధీనంలోని బృందాలు గత కొన్నేళ్లుగా హ్యాకింగ్‌లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తున్నాయి. ఈ సొమ్ముతో ఉ.కొరియా అణ్వాయుధాలు, క్షిపణలు తయారు చేస్తోందని ఐరాస పరిశోధక బృందాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లలోనే లాజరస్ గ్రూప్ ఒక్కటే 1.75 బిలియన్ డాలర్ల విలువైన సొమ్మును కాజేసినట్లు డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ 'చైన్ ఎనాలసిస్' పేర్కొంది.
'చైన్ ఎనాలసిస్' జనవరిలో ప్రచురించిన నివేదిక ప్రకారం ఉ.కొరియా హ్యాకర్లు గత ఏడాది 400 మిలియన్ డాలర్లు విలువైన డిజిటల్ ఆస్తులను దొంగలించారని పేర్కొంది. 2019లో రెండు బిలియన్ డాలర్ల ఆయుధాల తయారీకి ఈ సొమ్ము వెచ్చించారని.. ఇది హ్యాకింగ్‌ల ద్వారా సంపాదించిందేనని పేర్కొంది. ఆంక్షలు విధించిన ఉత్తర కొరియాకు మెటీరియల్, సాంకేతికత స్వేచ్ఛగా దొరకడానికి ఈ సొమ్మే కారణమని అమెరికా, ఐరాస నిపుణులు భావిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత గత వారం ఆ దేశం తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది.
బొగ్గు, 'యాపిల్ జ్యూస్'.. ఇవే ఉత్తర కొరియా జీవరేఖలు:సియోల్‌లోని బ్యాంక్ ఆఫ్ కొరియా లెక్కల ప్రకారం 2020లోనే ఉత్తరకొరియా జీడీపీలో వచ్చిన మొత్తంలో ఏకంగా 8శాతం సైబర్ క్రైమ్‌లను ఉపయోగించి సంపాదించిందని బ్యాంక్ ఆఫ్ సియోల్ వెల్లడించింది. ఈ బ్యాంక్ ఉ.కొరియా ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తోంది. 2019 తర్వాత నుంచి ఆ దేశ సరిహద్దులను ఉత్తర కొరియా మూసివేసింది. దీంతో ఆ దేశానికి రెండు మార్గాల్లోనే ఆదాయం లభిస్తోంది.