Trump FBI raids: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఆ దేశ ఫెడరల్ దర్యాప్తు సంస్థ(ఎఫ్‌బీఐ) దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మార్-ఎ-లాగో నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. తన ఇంటిని పూర్తిగా నిర్బంధించారని చెప్పారు.
"ఇవి మన దేశానికి చీకటి రోజులు. నా అందమైన ఇంటిని నిర్బంధించి, సోదాలు చేసి ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారు. గతంలో ఏ అధ్యక్షుడి విషయంలో ఇలాంటి దాడులు జరగలేదు. నా ఇంటిపై అప్రకటిత సోదాలు అనవసరం, అనుచితం. నా లాకర్లను సైతం పగులగొట్టారు. వాటర్‌గేట్ ఘటనకు, దీనికి తేడా ఏంటి? అప్పుడు డెమొక్రాట్ నేషనల్ కమిటీ భవనంలోకి అధికారులు చొరబడితే.. ఈసారి డెమొక్రాట్లు అమెరికా 45వ అధ్యక్షుడి ఇంట్లోకి బలవంతంగా వచ్చారు. ఇలాంటి ఘటనలు మూడో ప్రపంచ (వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న) దేశాల్లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు అమెరికా కూడా ఆ దేశాల్లో ఒకటిగా మారిపోవడం బాధాకరం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు