గర్భధారణ సమయంలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణిస్తున్నట్లు ఐరాస గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. 'ట్రెండ్స్ ఇన్ మెటెర్నల్ మోర్టాలిటీ' పేరుతో ఐరాస ఏజెన్సీలు.. ఇటీవలి కాలంలో మహిళల ఆరోగ్యంపై చేసిన రీసెర్చ్‌లో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 287,000 ప్రసూతి మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. తీవ్ర రక్తస్రావం, అధిక రక్తపోటు, గర్భధారణ సమయంలో వచ్చే అంటువ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్, మలేరియా వంటి అనేక వ్యాధుల కారణంగా ప్రెగ్నెన్సీ మహిళల మరణాలు సంభవిస్తున్నాయి. నాణ్యమైన వైద్యం అందిస్తే ఈ మరణాలను నివారించవచ్చని నివేదిక పేర్కొంది.
"గర్భధారణ అనేది మహిళలకు గొప్ప వరం. గర్భధారణ అనేది సానుకూలమైన అనుభవంగా ఉండాలి. కానీ చాలా మందికి సమయానికి మెరుగైన వైద్యం, పోషకాహారం అందకపోవటం కారణంగా ఈ మధురానుభవం వారిలో విషాదాన్ని మిగుల్చుతోంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి స్త్రీకి గర్భధారణ మొదలుకొని ప్రసవం వరకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ అధ్యయనం చెబుతోందని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రాలకు సరైన వసతులు కల్పించాలని పిలుపునిచ్చారు. శిశువులకు టీకాలు, పోషకాహారం అందించడం సహా కుటుంబ నియంత్రణ వంటి సేవల కోసం కమ్యూనిటీ సెంటర్లను బలోపేతం చేయాలని సూచించారు.