చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై దాడి చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఒప్పంద ఉల్లంఘనపై వేలాది మంది ఉద్యోగులు మాస్కులు ధరించి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. నెల క్రితం వచ్చిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని, పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆందోళనబాట పట్టారు. గత నెలలో జెంగ్ఝౌలో యాపిల్ తయారీ ప్రధాన భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్‌కు చెందిన ఫ్యాక్టరీని వదిలి ఇంటికి వెళ్లిపోయిన వారిస్థానంలో కొత్త కాంట్రాక్ట్‌తో ఉద్యోగాల్లో చేరినవారు తాజాగా నిరసనలు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై బాష్పవాయువు కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దృశ్యాలను ధ్రువీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం - చైనాలో నిరసనలు
చైనాలోని ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. నెల క్రితం వచ్చిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని, పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆందోళనబాట పట్టారు. వీరిపై పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు.. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఫ్యాక్టరీల్లో తయారీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కంపెనీల్లోనే క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులోనే ఉంచుతున్నారు. గత నెలలో ఫ్యాక్టరీలో కొవిడ్ నుంచి రక్షణ లేదని, బాధితులకు ఫ్యాక్టరీ సహకారం చేయకపోవడంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్లిపోయారు లక్షలాది మంది ఉద్యోగులు. వారంతా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకనే వెళ్లారు. చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అక్కడివారు లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. 6నెలల తర్వాత చైనాలో మొదటి కొవిడ్ మరణం ఇటీవలే నమోదైంది. చైనాలో కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కొన్నాళ్ల క్రితం ఆ సంస్థ పేర్కొంది.