ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల కవలలకు తండ్రైనట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయన తండ్రి ఎరాల్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారనే రహస్యం తాజాగా బయటపడింది. అయితే, ఏడుపదుల ప్రాయంలో తండ్రి అయినప్పటికీ, జన్మనిచ్చిన మహిళ మాత్రం ఆయనకు వరుసకు కూతురు (రెండో భార్య కుమార్తె) కావడం సొంత కుటుంబీకులనే విస్మయానికి గురిచేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించిన ఎరాల్ మస్క్ (76).. 'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి' అంటూ చెప్పడం గమనార్హం.
దక్షిణాఫ్రికాకు చెందిన ఎరాల్ మస్క్ ఓ ఇంజినీర్. ఆయనకు ఎలాన్ మస్క్ తల్లి మయే హల్దేమాన్‌తో 1979లో వివాహమయ్యింది. ఆ జంటకు మొత్తం ముగ్గురు పిల్లలు (ఎలాన్ మస్క్, కింబల్, టాస్కా). అయితే, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎరాల్ మస్క్ రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్య హైడే బెజూడెన్‌హౌట్‌తో ఇద్దరు పిల్లలకు తండ్రికాగా.. హైడేకు అంతకుముందే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు జానా బెజూడెన్‌హౌట్ (35). ప్రస్తుతం ఆమె సవతి తండ్రి అయిన ఎరాల్ మస్క్‌తోనే కలిసి ఉంటున్నారు.
వరుసకు కూతురయ్యే మహిళతో సహజీవనం చేసిన ఎరాల్ మస్క్‌కు 2017లో తొలి సంతానం కలిగింది. అనంతరం 2019లో మరో పాపకు తండ్రి అయ్యారనే రహస్యం ఇటీవల బయటకు వచ్చింది. ఇది కాస్త మీడియాలో ప్రచారం కావడంతో ఎలాన్ మస్క్ తండ్రి స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇలా మొదటి భార్యకు ముగ్గురు (ఎలాన్ మస్క్‌తో కలిపి), రెండో భార్యకు ఇద్దరు కాగా.. రెండో భార్య కూతురితో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తాజాగా తేలడంతో ఎరాల్ మస్క్‌కు మొత్తం ఏడుగురు సంతానం అయినట్లయ్యింది. మరోవైపు 51 ఏళ్ల ఎలాన్ మస్క్ కూడా మూడేళ్ల చిన్నారికి సోదరుడు అవడం విశేషం.