తెలంగాణ

telangana

ETV Bharat / international

మూడోసారీ 'పిల్ల' ప్రభావం.. వందేళ్లలో ఇదే తొలిసారి - లానినో

వానావానా వల్లప్పా అని పిలవకున్నా.. అనూహ్యంగా 'వాన పిల్ల' ఈసారీ ప్రపంచాన్నిపలకరిస్తోంది. శాస్త్రవేత్తలు లా నినాగా పిలిచే ఈ వాతావరణ పరిణామం వరుసగా మూడో ఏడాది చోటు చేసుకుంటోంది. ఇలా జరగటం వందేళ్లలో ఇదే తొలిసారంటున్నారు శాస్త్రవేత్తలు!

elnino lanino effect
elnino lanino effect

By

Published : Sep 19, 2022, 8:14 AM IST

Elnino Lanino Effect : ఎల్‌నినో అంటే పిల్లాడు; లా నినా అంటే పిల్ల అని స్పానిష్‌ భాషలో అర్థం! వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలను ఈ పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా తీరం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా.. చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఇఎన్‌ఎస్‌ఓఎస్‌) అంటుంటారు. ఈ ఇఎన్‌ఎస్‌ఓఎస్‌ పరిస్థితులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి. ఎల్‌ నినో సమయంలో విపరీతమైన వేడి, తక్కువ వర్షపాతం నమోదవుతుంటుంది. లా నినాలో వర్షాలు విపరీతంగా ఉంటాయి. సాధారణంగానైతే.. ఎల్‌ నినో, లా నినా ప్రతి నాలుగైదేళ్ల భ్రమణంలో సంభవిస్తుంటాయి.

కానీ.. అందుకు భిన్నంగా గత రెండేళ్లుగా లా నినా ప్రభావం చూపుతోంది. అవే పరిస్థితులు వరుసగా ఈఏడాది కూడా పసిఫిక్‌ సముద్రంపై కనిపిస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), ఆస్ట్రేలియన్‌ వాతావరణ శాఖ ప్రకటించాయి. ఇలా వరుసగా మూడేళ్లపాటు లా నినా కొనసాగటం ఈ వందేళ్లలో ఇదే తొలిసారి అంటున్నారు. 2020 సెప్టెంబరులో ఆరంభమైన ఈ లా నినా ప్రభావం.. మరో ఆరునెలలు ఉండే అవకాశాలు 70శాతం ఉన్నాయని.. వచ్చే ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశాలు 55శాతంగా ఉన్నాయని డబ్ల్యూఎంఓ అంచనా! ఈ లా నినా వల్ల ఒకవైపు విపరీతమైన వర్షాలు పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వేడి పెరుగుతోందంటున్నారు. తూర్పు ఆఫ్రికా, ఐరోపాలోని కొన్ని చోట్ల విపరీతమైన కరవు కాటకాలకు ఇదీ ఓ కారణమని భావన. ముఖ్యంగా తూర్పు ఆఫ్రికాలో వరుసగా నాలుగో సీజన్‌ వర్షాల్లేక అల్లాడుతోంది. ఇథియోపియా, కెన్యా, సోమాలియాలాంటి చోట్ల 2కోట్ల మంది ఆకలి చావుల అంచున ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కరవు పరిస్థితులు చూస్తున్న ఐరోపాలో శీతాకాలంలో లా నినా కారణంగా విపరీతమైన వానలు కురిసే అవకాశం లేకపోలేదంటున్నారు.

"వరుసగా మూడేళ్లపాటు లా నినా కొనసాగటం అసాధారణ పరిణామం"

- పెటెరి తాలస్‌, డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్‌

భారత్‌పై ప్రభావం..: లా నినా సమయాల్లో.. భారత్‌లో రుతుపవనాల ప్రభావం మేలు చేస్తోంది. ఈ ఏడాదే తీసుకున్నా... ఆగస్టు 30కల్లా సగటుకంటే 7శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షం పడింది. 'లా నినా మూడో ఏడాదీ కొనసాగటం ఆశ్చర్యకరం. అయితే ఇది మనదేశంలో రుతుపవనాలకు మేలే చేస్తోంది. రెండు మూడు రాష్ట్రాల్లో తప్పించి అన్ని చోట్లా వానలు బాగానే ఉన్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య తుపాన్లు ఉండే అవకాశం లేకపోలేదు' అని కేంద్ర భౌగోళికశాస్త్ర శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి;తైవాన్​లో మరోసారి భారీ భూకంపం- కుప్పకూలిన మూడంతస్తుల భవనం

125 సినిమా హాల్స్​లో రాణి అంత్యక్రియలు లైవ్.. 36కి.మీ బారికేడ్లు.. లక్షల మంది ప్రజలు.. ఖర్చు ఎంతంటే..

ABOUT THE AUTHOR

...view details