కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి - కొండచరియలు విరిగిపడి ఈక్వేడార్‌లో పలువురు మృతి
20:53 March 27
కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి
దక్షిణ ఈక్వెడార్‌లో కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆరుగురిని ప్రాణాలతో రక్షించినట్లు వారు వెల్లడించారు. సుమారు 7 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 500 మంది జనాభా, 163 ఇళ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదొక భయంకరమైన ప్రమాదమని ఆ దేశ రవాణా శాఖ మంత్రి డారియో హెర్రెరా అన్నారు. ప్రస్తుతం తామంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నామని ఆయన వెల్లడించారు. ఘటన ప్రాంతంలోని ఇళ్ల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నమని హెర్రెరా పేర్కొన్నారు. కొండ చరియాలు ఇంకా విరిగిపడే అవకాశాలు ఉన్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ఈ విపత్తు పాన్-అమెరికన్ హైవేలోని కొంత భాగాన్ని సైతం ధ్వంసం చేసిందని వారు వెల్లడించారు.
వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక శిబిరంపై విరిగపడ్డ కొండచరియలు..
2022 డిసెంబర్‌లోను మలేసియాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక శిబిరంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఆ సమయంలో 17 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బటాంగ్ కలి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక శిబిరంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ 94 మంది మలేసియన్లు ఉన్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్కూ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు.