Earthquake Tremors In Delhi : అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. తజకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూప్రకంపనలు మన దేశ రాజధాని దిల్లీని కూడా తాకాయి. దీంతో దిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. నోయిడాలో 9.30 గంటల సమయంలో రెండు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉండే స్థానికుడు ప్రీతి శంకర్ తెలిపారు. ఈ భూకంపం వళ్ల పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
భూకంప కేంద్రం ఆఫ్గనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో ఉత్తరం వైపు 36.38 డిగ్రీల అక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 196 కిలీ మీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అఫ్గానిస్థాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రత్యేకంగా హిందూకుష్ పర్వత ప్రాంతాల్లోని యూరేసియన్, ఇండియన్ టెక్టోనిక్ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపానికి కారణమవుతున్నాయి. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
జైపుర్‌లో మూడుసార్లు..
కొద్దిరోజుల క్రితం.. రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. జైపుర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జైపుర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. 'గంటలో మూడు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. నా కుటుంబం మొత్తం నిద్రలోంచి లేచాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు' అని స్థానికుడు వికాస్ తెలిపాడు.
గాఢనిద్రలో ఉండగా 3సార్లు భూప్రకంపనలు.. వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు!
భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రత.. సునామీ వార్నింగ్!