కూలిపోయిన ఇంటి శిథిలాల కింద అయిదు రోజులు సజీవంగా ఉన్న ఓ కుటుంబాన్ని తుర్కియేలో సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు తుర్కియే, సిరియాలలో సంభవించిన పెనుభూకంపం మృతుల సంఖ్య 28,000 దాటిపోయింది. తమ దేశంలో భూకంప మృతుల సంఖ్య 24,617కి చేరిందని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ శనివారం ప్రకటించగా, సిరియాలోని ప్రభుత్వ, తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాల్లో మరణించినవారి సంఖ్య 3,575కు చేరింది. తుర్కియేలో 80,104 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు ఎర్డోగాన్ తెలిపారు.
గాజియాన్‌తెప్ ప్రావిన్సులోని నూర్దగీ పట్టణంపై భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఓ ఇంటి శిథిలాల కింద ఉన్న అయిదుగురు కుటుంబసభ్యులనూ ఒకరి తర్వాత ఒకరుగా సహాయక బృందాల సభ్యులు కాపాడారు. ఒకవైపు ఆశలు కొడిగడుతుండగా, మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయినా.. 16 ఏళ్ల వయసున్న యువతిని, 70 ఏళ్ల వృద్ధురాలిని సైతం కాపాడారు. బయటికొచ్చిన తర్వాత.. 'ఈరోజు తేదీ ఏంటి' అని ఆ యువతి అడిగింది. తుర్కియే, కిర్గిజిస్థాన్ దేశాలకు చెందిన బృందాలు కలిసి రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి.
భారతీయ వైద్యుల సేవలు
భారత సైన్యానికి చెందిన 99 మంది వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన ఆసుపత్రుల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన శిబిరాల్లో బాధితులకు సాంత్వన కలిగిస్తున్నారు. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర సహాయ సామగ్రితో ఏడో విమానం శనివారం దిల్లీ నుంచి తుర్కియేకి బయలుదేరి వెళ్లింది.