Jaishankar on Russia oil imports: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన 9వ భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్‌లో పాల్గొన్న విదేశాంగమంత్రి జై శంకర్... రష్యాతో ఇంధన ఒప్పందాన్ని సమర్థించుకున్నారు. ఇంధన, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయడం తప్పుకాదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే ఉత్తమ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జైశంకర్ తెలిపారు. దేశంలో తలసరి ఆదాయం రెండు వేల డాలర్లు ఉందని, భారత ప్రజలు ఇంధనం కోసం అధిక ధరలు వెచ్చించలేరని ఆయన తెలిపారు.
రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ క్లారిటీ, దేశ సంక్షేమమే ముఖ్యమంటూ - రష్యా గ్యాస్ కొనుగోలు జైశంకర్
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తున్న వేళ ఆ దేశంతో భారత్ ఇంధన ఒప్పందం చేసుకోవడంపై చాలా దేశాలు భగ్గుమన్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ భారత నిర్ణయం సరైనదేనన్న భావన వ్యక్తమవుతోంది. బలమైన విదేశాంగ విధానంతో భారత్ అగ్రరాజ్యం అమెరికాకు ఇంధన ఒప్పందంపై తమ విధానాలను తెలియజెప్పింది. స్వయాన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా భారత విదేశాంగ విధానాన్ని ఆకాశానికెత్తేశారు.
"చమురు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం చమురు ధరలే కాదు గ్యాస్ ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. ఆసియా దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేసే సాంప్రదాయ దేశాలన్నీ ఇప్పుడు ఐరోపాకు తరలిస్తున్నాయి. ఎందుకంటే యూరప్ రష్యా నుంచి చాలా తక్కువగా ఇంధనాన్ని, గ్యాస్‌ను కొనుగోలు చేస్తోంది. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతులు తగ్గించుకొని.. భారత్‌కు ఇంధనం సరఫరా చేసే పశ్చిమాసియా దేశాల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. ప్రతి దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు ఉత్తమమైన ఒప్పందాలపై వైపు మొగ్గు చూపుతుంది. మేము కూడా అదే చేస్తున్నాం. ఈ విషయంలో మేం చాలా ఓపెన్‌గా... నిజాయతీగా ఉన్నాం. మాది 2 వేల డాలర్ల తలసరి ఆదాయం ఉన్న దేశం. ఇక్కడి ప్రజలు అధిక ఇంధన ధరలను భరించలేరు. మెరుగైన ఒప్పందాలను (చమురు కొనుగోలు విషయంలో) అన్వేషించడం నా నైతిక బాధ్యత."
-జైశంకర్, విదేశాంగమంత్రి
రష్యాతో ఇంధన ఒప్పందం మేలిరకమైనదని జైశంకర్ పేర్కొన్నారు. భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా దాన్ని కొనసాగిస్తున్నామన్నారు. సంప్రదాయ పంపిణీదారులంతా ఐరోపాకు ఇంధనాన్ని తరలిస్తున్న వేళ... భారత్ ముందు ఇంతకన్నా మెరుగైన మార్గం లేదని తేల్చి చెప్పారు. దేశ పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయం అమెరికాకు కూడా అర్థమైందని జైశంకర్ తెలిపారు. రష్యాతో భారత్ తక్కువ ధరకు ఇంధన కొనుగోలు చేయడంపై ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కొనియాడారు.