Drone Strike On Ship: భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ భూభాగం నుంచి బయలుదేరిందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఇటీవల ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్ వాణిజ్య నాకలపై తరచూ దాడులు జరగుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనతో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల పరిధి ఎర్ర సముద్రాన్ని దాటినట్లయిందని పెంటగాన్ తెలిపింది. అయితే శనివారం జరిగిన దాడి మాత్రం గుజరాత్ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో జరగడం గమనార్హం.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత నౌకలపై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా బహిరంగంగా ఆరోపించడం ఇదే తొలిసారి. తాజాగా దాడికి గురైన నౌక లైబీరియన్ జెండాతో వస్తోందని, అది డచ్ సంస్థకు చెందినదని పెంటగాన్ తెలిపింది. కానీ ప్రస్తుతం అది జపాన్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహణలో ఉన్నట్లు వెల్లడించింది.
అయితే, ఈ నౌకకు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉందని, రసాయనాలు, దానికి సంబంధిత ఉత్పత్తులతో కూడిన ట్యాంకర్లను తీసుకెళ్తోందని మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే పేర్కొంది. మరోవైపు ఎంవీ కెమ్ ప్లూటో ఇజ్రాయెల్ వ్యాపారవేత్త ఇడన్ ఓఫర్‌కు చెందినదని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కానీ, ఇప్పటి వరకు నౌకపై దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
గుజరాత్‌లోని వెరావల్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై శనివారం ఈ దాడి జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ వెంటనే ఐసీజీఎస్ విక్రమ్ పీ-81 రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదం నుంచి నౌకలో ఉన్న 25 మంది సిబ్బంది సురక్షింతగా బయటపడ్డారు. ఈ ఘటనపై భారత్ నావిళ దళం దర్యాప్తు ప్రారంభించింది.