తెలంగాణ

telangana

ETV Bharat / international

Drone Attack On Russian Airport : రష్యా ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ల దాడి.. నాలుగు విమానాలు ధ్వంసం!

Drone Attack On Russian Airport : రష్యాలో మరోసారి డ్రోన్ల దాడి కలకలం సృష్టించింది. పోస్కోవ్​ ఎయిర్​పోర్ట్​పై జరిగిన ఈ డ్రోన్ల దాడి వల్ల నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి.

Drone Attack On Russian Airport
Drone Attack On Russian Airport

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 6:42 AM IST

Updated : Aug 30, 2023, 8:51 AM IST

Drone Attack On Russian Airport :రష్యా వాయువ్య ప్రాంతంలోని పోస్కోవ్‌ నగరంలో ఉన్న ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన రష్యా ఆర్మీ.. డ్రోన్లపై ఎదురుదాడికి దిగింది. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్‌ మిఖాయిల్‌ వెడెర్నికోవ్‌ ధ్రువీకరించారు.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగి..
Drone Attack In Russia Today : ఈ ఘటనలో నాలుగు ఇల్యూషిన్‌-76 విమానాలు దెబ్బతిన్నాయని రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల దాడి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు పేర్కొన్నాయి. పోస్కోవ్‌ నగరం.. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి 600 కి.మీల దూరంలో ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్ల దాడికి సంబంధించిన వీడియోను స్థానిక గవర్నర్‌ టెలిగ్రామ్‌లో షేర్‌ చేశారు. బుధవారం పోస్కోవ్​ ఎయిర్​పోర్ట్​లో విమానాల రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Drones Attack Russia :అయితే పోస్కోవ్​ ఎయిర్​పోర్ట్​తో పాటు మరో ఐదు చోట్ల ఉక్రెయిన్​.. ఈ డ్రోన్ల దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్​- రష్యా మొదలైన తర్వాత 18 నెలల్లో ఇదే అతి పెద్ద డ్రోన్ల దాడిగా అభివర్ణించింది. ఓరియోల్, బ్రయాన్స్క్, రియాజాన్, కలుగా, మాస్కో ప్రాంతాలపై ఉక్రెయిన్​ డ్రోన్‌లు దాడికి దిగాయని ఆరోపణలు చేసింది. పోస్కోవ్​లో మాత్రమే నష్టం జరిగిందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడిపై ఇంతవరకు ఉక్రెయిన్‌స్పందించలేదు.

గోప్యంగా ప్రిగోజిన్​ అంత్యక్రియలు..
Prigozhin Final Rites : మరోవైపు, అనుమానాస్పద రీతిలో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ అంత్యక్రియలు అత్యంత గోప్యంగా జరిగాయి. పొరొఖొవ్‌స్కొయె శ్మశానవాటికలో అత్యంత పటిష్ఠమైన భద్రతా వలయం మధ్య మంగళవారం.. అంత్యక్రియలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రిగోజిన్​ సమాధి సమీపంలో రష్యా, వాగ్నర్​ గ్రూప్​ జెండాలను అమర్చినట్లు చెప్పాయి.

Prigozhin Mystery : ప్రిగోజిన్​ అంత్యక్రియలకు హాజరుకావాలనే యోచన.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు లేదని క్రెమ్లిన్‌ వర్గాలు స్పష్టం చేశాయి. విమాన ప్రమాదం వెనుక పుతిన్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రిగోజిన్‌ అంత్యక్రియల ప్రదేశం గురించి చివరి వరకు గోప్యంగా ఉంచడం స్థానికంగా చర్చ జరిగింది. అయితే ప్రిగోజిన్​ కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకే గోప్యంగా నిర్వహించినట్లు రష్యా మీడియా వర్గాలు తెలిపాయి.

ఎవరీ ప్రిగోజిన్..?
Wagner Group Chief Prigozhin :రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్‌ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్‌ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌, ప్రిగోజిన్‌లకు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్‌ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్‌ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్‌ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది.

Last Updated : Aug 30, 2023, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details