960 ప్రయత్నాలు.. 11వేల పౌండ్ల ఖర్చు.. 2005లో తొలి పరీక్ష.. ఏళ్ల తర్వాత విజయం.. ఇదీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ పడ్డ ప్రయాస! దక్షిణ కొరియాకు చెందిన చా సా-సూన్ (69) 2005 ఏప్రిల్‌లో తొలిసారి లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ రాసింది. ఆ రాత పరీక్షలో ఆమె ఫెయిల్ అయింది. ఆ తర్వాతి రోజు నుంచి వారానికి ఐదు రోజులు డ్రైవింగ్ పరీక్ష రాస్తూనే ఉంది. ఇలా మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా వారానికి ఐదు రోజులు పరీక్షకు హాజరైంది. మూడేళ్లలో 780 ప్రయత్నాలు చేసింది. వీటన్నింటిలోనూ అదే ఫలితం. ప్రతి పరీక్షలోనూ విఫలం!
చా సా-సూన్ స్థానంలో మరెవరున్నా ప్రయత్నాన్ని విరమించేవారేమో! కానీ పట్టువదలని విక్రమార్కుడిలా సా-సూన్ ముందుకు సాగింది. మరీ వారానికి ఐదు రోజులంటే.. విసుగ్గా అనిపించిందో ఏమో.. మూడేళ్ల తర్వాత వారానికి రెండుసార్లే పరీక్షకు వెళ్లడం మొదలుపెట్టింది. ఇలా ఏడాదిన్నరకు పైగా ప్రయత్నాలు చేసింది. చివరకు ప్రాక్టికల్ టెస్టుకు ఎంపికైంది. పది సార్లు ప్రయత్నించి ప్రాక్టికల్ టెస్టులోనూ పాసైంది. మొత్తంగా 960 ప్రయత్నాల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందింది చా సా-సూన్.
కూరగాయలు అమ్మే వ్యాపారంలో ఉన్న ఈ మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం. అందుకే అన్నిసార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో దాదాపు 11 వేల పౌండ్లు (రూ.11.16లక్షలు) వెచ్చించింది. చా సా-సూన్కు లైసెన్స్ రాగానే తమపై భారం దిగినట్లు అనిపించిందని ఆమెకు డ్రైవింగ్ నేర్పించిన జోన్బుక్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు తెలిపాడు.
"ఆమెకు లైసెన్స్ వచ్చిన వెంటనే బొకేలు తీసుకెళ్లి ఇచ్చాం. కంగ్రాట్స్ చెప్తూ అందరూ హగ్స్ ఇచ్చుకున్నారు. మాపై భారం మొత్తం దిగినట్లు అనిపించింది. అన్నిసార్లు విఫలమయ్యేసరికి డ్రైవింగ్ టెస్టుకు వెళ్లడం మానేయాలని చెబుదామనుకున్నాం. కానీ ఆమె పదేపదే స్కూల్‌కు వచ్చేసరికి మాకు అంత ధైర్యం రాలేదు."
-డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు
ఇన్ని ప్రయత్నాలు చేసిన ఆమె.. దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. సెలెబ్రిటీగా మారిన ఆమె హ్యుందాయ్ కార్ల యాడ్లోనూ కనిపించారు. ఆ కంపెనీ చా సా-సూన్కు 11,640 పౌండ్ల (రూ.11.82లక్షలు) విలువ చేసే ఓ కొత్త కారును గిఫ్ట్‌గా ఇచ్చింది.
నిజానికి ఈ కథంతా 15ఏళ్ల కింద జరిగినదే. ఇటీవల ఓ యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో ఈ స్టోరీని షేర్ చేయగా మరోసారి వైరల్‌గా మారింది. నెటిజనం అంతా దీనిపై తమ అభిప్రాయాలను చెబుతూ రీపోస్ట్ చేస్తుండటం వల్ల మళ్లీ దీనిపై చర్చ జరుగుతోంది.
'నేనైతే ఐదు సార్లు ఫెయిల్ అయితే దాన్నుంచి దూరంగా పారిపోతా. 960 అనేది అసలు ఊహించుకోవాల్సిన అవసరం లేదు.'... 'పది సార్లు డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయ్యారంటే.. వారికి వాహనం నడిపే అవకాశం ఇవ్వకూడదు'... '960 సార్లు పరీక్ష రాసే చేసే ముందు.. ఏదో ఒక సమయంలో డ్రైవింగ్ మనకెందుకు అని ఆలోచించాలి' అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కానీ, మరికొందరు మాత్రం చా సా-సూన్ పట్టుదలను మెచ్చుకుంటున్నారు. ఆమె పట్ల సానుభూతి చెబుతున్నారు. "959 సార్లు కింద పడ్డా.. 960వ సారి పైకి లేవాలన్న సందేశం ఆమె కథ ద్వారా మనకు తెలుస్తోంది. ఆమెకు రాత పరీక్ష విషయంలో ఎవరూ సాయం చేయకపోవడం ఇందులో విచారకరమైన అంశం" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. "ఇదంతా మనకు గుణపాఠం కావాలి. నెవర్ గివ్ అప్ అనే సందేశాన్ని అర్థం చేసుకోవాలి" అని మరొకరు పోస్ట్ చేశారు.