కృత్రిమమేధతో నడిచే.. డ్రైవర్ లేని స్వయం చోదిత వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. దిగ్గజ కంపెనీల హామీలే ఇందుకు కారణం. అయితే ఇది సులువేమీ కాదంటున్నారు.. కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో అంతర్జాతీయ నిపుణులు ఆచార్య కె.సుబ్బారావు. అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయం చోదక వాహనాలు, కృత్రిమమేధపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కృత్రిమ మేధను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఏఐ నిపుణుడిగా దీనిపై మీ విశ్లేషణేంటి?
ఏకాగ్రతలో లోపాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో 'ప్రిడిక్టివ్ ఏఐ నమూనాలు' కచ్చితంగా ఉపయోగపడతాయి. అనేక ఆధునిక వాహనాల్లో ఇప్పటికే పాక్షికంగా డ్రైవర్‌కు తోడ్పాటు అందించే వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటివి బ్లైండ్ స్పాట్ వంటివాటిని గుర్తించేలా చోదకులను అప్రమత్తం చేస్తాయి. హమ్‌సేఫర్ వంటి యాప్‌లు అమెరికా తదితర దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ప్రధానంగా ఆటోమోటివ్ బీమా కంపెనీలు వీటిని ఉపయోగిస్తున్నాయి. డ్రైవర్‌ను పర్యవేక్షించడం, తదనుగుణంగా అప్రమత్తం చేయడం చాలా ప్రయోజనకరమే. అయితే చోదకుడి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించడం, దాని ఆధారంగా డ్రైవర్లకు రేటింగ్ ఇవ్వడం వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి.
రోడ్డుపై భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఇతర ఏఐ పరిజ్ఞానాలేంటి?
డ్రైవింగ్ తోడ్పాటు వ్యవస్థలను ఆరు విభాగాలుగా చూస్తాం. ఇందులో 'సున్నా' అంటే ఎలాంటి ఆటోమేషన్ లేదన్నమాట! లెవల్ 5 అంటే స్వయంచోదక వాహనం. అయితే ప్రజల దృష్టి ఎక్కువగా లెవల్ 4, 5 ఆటోమేషన్‌పై ఉంటోంది. టెస్లా వంటి కంపెనీలు ఇచ్చిన భారీ హామీలే ఇందుకు కారణం. కానీ ఇవేవీ పూర్తిగా ఆచరణలోకి రాలేదు. కొన్నేళ్లుగా లెవల్ 1-3 స్థాయిలో చాలా పురోగతి చోటుచేసుకుంది. ఏఐ సాయంతో డ్రైవర్లకు తోడ్పాటు అందించడం, నిర్దిష్ట సమయాల్లో అప్రమత్తం చేయడం వంటివి వీటి కింద జరుగుతున్నాయి. ప్రమాదం, వాహనం టైర్లు జారిపోయే (స్కిడ్) ముప్పులను గుర్తించినప్పుడు అవి స్వయం ప్రతిపత్తి మోడ్ (అటానమస్)లోకి వెళుతున్నాయి.
విద్యుత్ వాహనాలే (ఈవీ) భవిష్యత్ రవాణా సాధనాలు. వీటిలో భద్రతను పెంచడానికి ఏఐ తోడ్పడుతుందా?
నిజానికి డ్రైవర్ భద్రత, డ్రైవింగ్ తోడ్పాటు వంటి అంశాలకు వాహన ఇంజిన్‌తో చాలా వరకూ సంబంధం ఉండదు. ఇంధన సమర్థత, పర్యావరణానికి మేలు దృష్ట్యానే ఈవీలను తెస్తున్నారు. డ్రైవింగ్ తోడ్పాటు సాంకేతికతలను చాలావరకూ ఈవీలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం యాదృచ్ఛికమే. ఈవీలు అందుబాటులోకి వచ్చిన అనేక దేశాల్లో వాహన ధర అంశంపై వినియోగదారులకు పట్టింపు లేకపోవడమే ఇందుకు కారణం. సైద్ధాంతికంగా చూస్తే ఏఐ సాంకేతికతలన్నింటినీ ప్రామాణిక ఇంజిన్లకూ అమర్చవచ్చు.