Donald Trump US Supreme Court :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ కొలరాడో కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే నెల 8న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. క్యాపిటల్ భవనంపై దాడి ఘటన నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ అనర్హుడని కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరు తొలగిస్తూ గతనెల అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో ట్రంప్ న్యాయవాదులు అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొలరాడో కోర్టు తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తిచేశారు. ఒకవేళ కొలరాడో కోర్టును సుప్రీం కోర్టు సమర్థించినట్లయితే ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓట్లు వేయకుండా ఓటర్లను న్యాయవ్యవస్థ అడ్డుకోవటం అమెరికా చరిత్రలోనే మొదటిసారి అవుతుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి అర్హతను నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది కానీ రాష్ట్రాల కోర్టులకు కాదన్నారు. ఆ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.